Flipkart: యూపీఐ సేవలు ప్రారంభించిన ఫ్లిప్ కార్ట్
- ఇప్పటికే అమెజాన్ లో యూపీఐ చెల్లింపులు
- ఇకపై ఫ్లిప్ కార్ట్ యాప్ లోనూ ఆన్ లైన్, ఆఫ్ లైన్ యూపీఐ సేవలు
- ఫ్లిప్ కార్ట్ యాప్ లో యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకోవడం ద్వారా చెల్లింపులు
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ చాలాకాలంగా అమెజాన్ పే పేరిట యూపీఐ చెల్లింపు సేవలు అందిస్తుండగా... ఇప్పుడు మరో ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ కూడా యూపీఐ చెల్లింపుల రంగంలోకి అడుగుపెట్టింది. ఇకపై ఫ్లిప్ కార్ట్ యాప్ ద్వారా యూపీఐ చెల్లింపులు (ఆన్ లైన్, ఆఫ్ లైన్) చేయవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది.
ఇప్పటివరకు ఫ్లిప్ కార్ట్ లో యూపీఐ ద్వారా కొనుగోళ్లకు ఫోన్ పే, గూగుల్ పే వంటి ఇతర ప్లాట్ ఫాంలను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంకు సౌజన్యంతో సొంతంగా యూపీఏ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికోసం ఫ్లిప్ కార్ట్ యాప్ లో యూపీఐ ఐడీని క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది.
ప్రస్తుతానికి యూపీఐ సేవలను ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చామని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది.