KCR: టీడీపీ ఎలా ఓడిపోనుందో ఆరోజు ఎన్టీఆర్ కు వివరించాను: కేసీఆర్
- లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం
- ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని వ్యాఖ్య
- లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విజయం కోసం అందరూ కృషి చేయాలని సూచన
ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ... అభ్యర్థులను మార్చడం సాధ్యం కాని పరిస్థితుల్లోనే ఎన్నికలకు వెళ్లాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో సానుకూలత ఉన్నప్పటికీ, ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత ఫలితాలను తారుమారు చేసిందని అన్నారు. ఉమ్మడి ఏపీలో తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు... టీడీపీ ఎలా ఓడిపోనుందో ఎన్టీఆర్ కు వివరించానని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న పథకాలను, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన పథకాలతో ప్రజలు పోల్చి చూస్తున్నారని కేసీఆర్ చెప్పారు. ఎన్నికలకు ముందు ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయని విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలతో ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపు వస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. లోక్ సభలో పోటీ చేసే అభ్యర్థుల విజయం కోసం నేతలంతా కృషి చేయాలని చెప్పారు.