YSRCP: ఆంధ్రప్రదేశ్లో వైసీపీదే హవా.. గతంలో కంటే భారీగా పెరగనున్న టీడీపీ సీట్లు... ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వే
- వైసీపీ స్థానాలు 22 సీట్ల నుంచి 15కు తగ్గే అవకాశముందన్న సర్వే ఫలితాలు
- టీడీపీ లోక్ సభ స్థానాలు 3 నుంచి 10కి పెరగవచ్చునన్న సర్వే
- కాంగ్రెస్, బీజేపీలు ఒక్క సీటు కూడా దక్కించుకోకపోవచ్చునన్న ఒపీనియన్ పోల్
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పోటీ మొత్తం వైసీపీ, టీడీపీ మధ్యనే ఉండవచ్చునని ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 15 సీట్లు, తెలుగుదేశం పార్టీ 10 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వేలో వెల్లడైంది. తెలంగాణ సహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ లేదా బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకోవచ్చునని సర్వేలో తేలింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ జాతీయ పార్టీలు... రెండూ ఒక్క సీటూ గెలుచుకునే అవకాశాలు లేవని ఒపీనియన్ పోల్ విశ్లేషించింది.
2019 లోక్ సభ ఎన్నికల్లో 25 సీట్లకు గాను వైసీపీ 22, టీడీపీ 3 స్థానాల్లో గెలిచాయి. కానీ ఈసారి వైసీపీ 7 సీట్లు కోల్పోవచ్చునని... అవి టీడీపీ ఖాతాలో పడే అవకాశముందని సర్వే ఫలితాల్లో వెల్లడైంది. దక్షిణ భారతదేశంలో 132 స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 38, ఇండియా కూటమి 60, ఇతరులు 32 గెలుచుకోవచ్చునని ఈ సర్వే అంచనా వేసింది.