Indian Killed In Israel: ఇజ్రాయెల్ పై క్షిపణి దాడి.. భారతీయుడి మృతి, ఇద్దరికి గాయాలు
- ముగ్గురూ కేరళ వాసులే.. గాయపడ్డ వారికి ఆసుపత్రిలో చికిత్స
- లెబనాన్ వైపు నుంచి దాడి జరిగిందన్న అధికారులు
- షియత్ హెజ్బుల్లా గ్రూపు పనేనని అనుమానాలు
ఇజ్రాయెల్ పై లెబనాన్ టెర్రర్ గ్రూపు జరిపిన క్షిపణి దాడిలో భారతీయుడు ఒకరు చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. చనిపోయిన వ్యక్తి సహా గాయపడ్డ ఇద్దరూ కేరళవాసులని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నార్తరన్ ఇజ్రాయెల్ లోని మార్గలియత్ (వ్యవసాయ క్షేత్రం)పై సోమవారం ఉదయం క్షిపణి దాడి జరిగింది. లెబనాన్ వైపు నుంచి దూసుకొచ్చిన మిసైల్ వ్యవసాయ క్షేత్రంలో పడడంతో భారీ పేలుడు సంభవించింది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
అందులో ఒకరు స్పాట్ లోనే చనిపోగా.. మిగతా ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం.. బాధితులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించింది. ఈ దాడిలో కేరళలోని కొల్లాంకు చెందిన పట్నిబిన్ మాక్స్ వెల్ చనిపోయాడు. ఇడుక్కి జిల్లా వాసి పాల్ మెల్విన్ తో పాటు బుష్ జోసెఫ్ లకు చికిత్స అందిస్తున్నామని బెయిలిన్సన్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వారిద్దరూ క్షేమంగానే ఉన్నారని, చికిత్సతో కోలుకుంటున్నారని వివరించారు.
కాగా, ఇజ్రాయెల్ సరిహద్దుల్లో హమాస్ టెర్రరిస్టులు దాడి చేయడంతో అక్టోబర్ 8న గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిత్యం దాడులు చేస్తూ టెర్రరిస్టులను మట్టుబెడుతోంది. ఈ క్రమంలో గాజాకు మద్దతుగా లెబనాన్ లోని టెర్రర్ గ్రూపులు నార్త్ ఇజ్రాయెల్ పై తరచూ దాడులు చేస్తున్నాయి. తాజాగా దాడికి పాల్పడింది షియత్ హెజ్బుల్లా గ్రూపు కావొచ్చని ఇజ్రాయెల్ అధికారులు అనుమానిస్తున్నారు.