Professor Saibaba: ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి.. బాంబే హైకోర్టు తీర్పు

Professor GN Saibaba Acquitted By Bombay High Court

  • జీవిత ఖైదును రద్దు చేసిన న్యాయస్థానం
  • మావోయిస్టులతో లింకుల కేసులో అరెస్టు
  • 2017లో సాయిబాబాను దోషిగా తేల్చిన సెషన్స్ కోర్టు

ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. ఆయనకు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది. ఈమేరకు మంగళవారం ఉదయం బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో మహారాష్ట్ర పోలీసులు ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఆయన నివాసంలో మావోయిస్టు సాహిత్యం దొరికిందని ఆరోపించారు. ఆయనను గడ్చిరోలి సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. 2017లో సెషన్స్ కోర్టు ఆయనను దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. 

అనారోగ్యంతో వీల్ చెయిర్ కే పరిమితమైన ప్రొఫెసర్ సాయిబాబా ప్రస్తుతం నాగ్ పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. సెషన్స్ కోర్టు తీర్పుపై ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. 2022 అక్టోబర్ 14న ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది. సెషన్స్ కోర్టు తీర్పును కొట్టేసింది. అయితే, ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. బాంబే హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. మరోసారి విచారణ జరపాలని బాంబే హైకోర్టుకు సూచించింది. దీంతో మళ్లీ విచారించిన బాంబే హైకోర్టు తాజాగా మంగళవారం ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.

  • Loading...

More Telugu News