YS Jagan: మళ్లీ గెలుస్తా... విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా: సీఎం జగన్
- విశాఖలో 'విజన్ విశాఖ' సదస్సు
- వచ్చే ఎన్నికల తర్వాత విశాఖ నుంచి పాలన సాగిస్తానన్న సీఎం జగన్
- అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని వెల్లడి
- విశాఖ వంటి పెద్ద నగరం రాష్ట్రానికి అవసరమని స్పష్టీకరణ
విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విజన్ విశాఖ సదస్సులో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఎన్నికల్లో ఈసారి కూడా విజయం తమదేనని, మళ్లీ గెలిచి విశాఖ నుంచి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని తెలిపారు.
అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని, అమరావతి ఇప్పటికే శాసనరాజధానిగా కొనసాగుతోందని పేర్కొన్నారు. విభజన తర్వాత హైదరాబాద్ ను కోల్పోయామని, అందుకే విశాఖ వంటి పెద్ద నగరం రాష్ట్రానికి అవసరం అని సీఎం జగన్ స్పష్టం చేశారు.
అభివృద్ధిలో విశాఖ నగరం దూసుకెళుతోందని అన్నారు. హైదరాబాద్ కంటే విశాఖలో అభివృద్ధి అధికంగా జరుగుతోందని వివరించారు. బెంగళూరు కన్నా విశాఖలోనే మెరుగైన సదుపాయాలు ఉన్నాయని చెప్పారు.
కానీ కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ, విపక్షానికి లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కోర్టు కేసులతో విపక్షాలు అడ్డుకుంటున్నాయని, స్వార్థ ప్రయోజనాల కోసం విశాఖపై విషం చిమ్ముతున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.