Taiwan Minister: భారతీయులకు క్షమాపణ చెప్పిన తైవాన్ మంత్రి.. ఎందుకంటే..!

Taiwan Minister Apologises After Criticism Over Racist Remark On Indians

  • వలస కార్మికుల నియామకంపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
  • ఉత్తర భారతీయులకే ప్రాధాన్యం ఇస్తామంటూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడి
  • శరీర వర్ణం, ఆహారపుటలవాట్లు తమలాగే ఉంటాయన్న మంత్రి
  • మంత్రి వర్ణ వివక్ష చూపించారంటూ విమర్శలు

తైవాన్ కార్మిక శాఖ మంత్రి సు మింగ్ చున్ భారతీయులకు క్షమాపణ చెప్పారు. విదేశీ కార్మికుల నియామకం విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు వివాదం కావడంపై చున్ తాజాగా స్పందించారు. తన వ్యాఖ్యల వెనక ఎలాంటి దురుద్దేశం లేదని, నియామక ప్రక్రియలో వర్ణ వివక్షకు చోటివ్వబోమని వివరణ ఇచ్చారు. కార్మికుల నియామకానికి అనుభవం, నాణ్యతకే ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. వలస కార్మికులైనా, తైవాన్ పౌరులైనా.. ఎవరైనా సరే క్వాలిటీ వర్క్ కోసం సిద్ధం చేసుకున్న ప్రమాణాలకు లోబడి నియామకం చేపడతామని వివరించారు. ఈమేరకు సు మింగ్ చున్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

మంత్రి ఏమన్నారంటే..
సోమవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సు మింగ్ చున్ మాట్లాడుతూ.. వలస కార్మికుల నియామకం విషయంలో నార్త్ ఇండియన్లకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. అక్కడి పౌరుల శరీర రంగు తెల్లగా తైవానీయులకు దగ్గరగా ఉంటుందని, ఆహారపుటలవాట్లు కూడా దాదాపుగా ఒకేలా ఉంటాయని చెప్పారు. అందుకే నార్త్ ఇండియన్లను ఉద్యోగాలలోకి తీసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పారు. ఈ వివాదంపై తైవాన్ కార్మిక శాఖ కూడా విచారం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. మంత్రి వ్యాఖ్యల వెనక ఎలాంటి దురుద్దేశం లేదని, అయితే, ఆ వ్యాఖ్యలు తప్పుడు సందేశమిచ్చేలా ఉండడం దురదృష్టకరమని పేర్కొంది.

మండిపడుతున్న ప్రతిపక్ష నేతలు..
భారతీయులపై మంత్రి సు మింగ్ చున్ చేసిన వ్యాఖ్యలపై తైవాన్ ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నేత చెన్ కువాన్ టింగ్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వలస కార్మికుల నియామకానికి చర్మ రంగు ప్రాతిపదిక కాకూడదని చెప్పారు. భారతీయులను కించపరిచారంటూ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News