Vijaya Sai Reddy: ప్రశాంత్ కిశోర్ మాటల వెనుక దురుద్దేశం ఉంది: విజయసాయిరెడ్డి
- పీకే మాటల్లో విశ్వసనీయత లేదన్న వైసీపీ నేత
- తమ అభివృద్ధే మరోసారి తమను గెలిపిస్తుందని ఆశాభావం
- నెల్లూరు నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీపడుతున్నట్లు వెల్లడి
రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి పరాభవం తప్పదని ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిశోర్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఇలా ప్రశాంత్ కిశోర్ వైసీపీ సర్కార్‌కు వ్యతిరేకంగా మాట్లాడడంతో ఆ పార్టీ నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలువురు పీకేపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు కూడా. పీకేను చంద్రబాబుకు దొరికిన కొత్త పావుగా అభివర్ణిస్తున్నారు ఆ పార్టీ నేతలు.
ఇదేకోవలో తాజాగా వైసీపీ సీనియర్ లీడర్ విజయసాయిరెడ్డి సైతం ప్రశాంత్ కిశోర్ జోస్యం పట్ల ధ్వజమెత్తారు. పీకే మాటల్లో విశ్వసనీయత కొరవడిందని అన్నారు. ఆ మాటల వెనక దురుద్దేశం ఉందని పేర్కొన్నారు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందనేది రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని అన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధే మరోసారి తమను గెలిపిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.
ఇక సిద్ధం మహాసభలతో వైసీపీ దూసుకుపోతున్న విషయాన్ని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. మూడు సిద్ధం సభలకు చరిత్రలో నిలిచిపోయేలా జనాలు హాజరయ్యారని చెప్పిన ఆయన.. సీఏం జగన్ ప్రజలకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99శాతం నెరవేర్చారని స్పష్టం చేశారు. ఈసారి కూడా తమ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మరింత మెరుగైన పరిపాలన అందించేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు. అలాగే సీఏం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాను నెల్లూరు నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీపడుతున్నట్లు విజయసాయిరెడ్డి తెలియజేశారు. పుట్టి పెరిగిన గడ్డపై పోటీ చేయడం సంతోషంగా ఉందని, గెలిచి ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యంగా పేర్కొన్నారు.