AI Teacher: వావ్.. కేరళలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఏఐ టీచరమ్మ..!
- చక్కటి చీరకట్టుతో ఆకట్టుకుంటున్న ఐరిస్ టీచరమ్మ
- పాఠాలు చెబుతుంటే ఆసక్తి కనబరుస్తున్న విద్యార్థులు
- విద్యార్థుల సందేహాలను సైతం నివృత్తి చేస్తున్న వైనం
ప్రస్తుతం అన్ని రంగాలలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం అంతకంతకు పెరగుతోంది. మీడియా, మోడలింగ్ ఇలా ప్రతి చోట కృత్రిమ మేధతో రూపొందిన ప్రతిమలు పని చేస్తున్నాయి. ఇదేకోవలో తాజాగా విద్యారంగంలో కూడా ఏఐ ప్రవేశించింది. కేరళలో ఏఐ టీచర్మ ఎంచక్కా విద్యార్థులకు పాఠాలు చెబుతోంది. కేరళ రాజధాని తిరువనంతపురంలోని కేటీసిటీ స్కూల్ యాజమాన్యం ఇలా తమ విద్యార్థులకు ఏఐతో రూపొందిన టీచరమ్మతో పాఠాలు చెప్పిస్తున్నారు. ఈ ఏఐ టీచరమ్మకు ఐరిస్‌గా పేరు కూడా పెట్టడం జరిగింది.
అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్ట్‌లో భాగంగా దీన్ని మేకర్ల్యాబ్స్ ఎడ్యుటేక్ సహకారంతో రూపొందించారు. చక్కటి చీరకట్టులో అచ్చం మహిళ గొంతులో ఐరిస్ పాఠాలు బోధిస్తుంటే విద్యార్థులు ఆసక్తిగా వింటున్నారని పాఠశాల యాజమాన్యం చెబుతోంది. పిల్లలకు పాఠాలు అర్థమయ్యేలా చెప్పడంతో పాటు వారి సందేహాలను సైతం నివృత్తి చేస్తోందట. ఇది బహుభాషల్లో మాట్లాడగలదని రూపకర్తలు వెల్లడించారు. ఐరిస్ పాఠాలు చెబుతున్న వీడియోను మేకర్ల్యాబ్స్ ఎడ్యుటేక్ వారు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది.