Mudragada Padmanabham: ముద్రగడ నివాసానికి వెళ్లనున్న మిథున్ రెడ్డి.. వైసీపీలో చేరనున్న కాపు నేత!
- కిర్లంపూడిలో ముద్రగడతో చర్చలు జరపనున్న మిథున్ రెడ్డి
- ముద్రగడకు నామినేటెడ్ పదవి ఆఫర్
- ఈ నెల 12న వైసీపీలో చేరే అవకాశం
ఏపీ రాజకీయాల్లో మరో కీలక సన్నివేశం చోటుచేసుకోబోతోంది. కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం దాదాపు ఖాయమైపోయింది. ముద్రగడ నివాసానికి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి కాసేపట్లో వెళ్లనున్నారు. జిల్లాలోని వైసీపీ కీలక నేతలతో కలిసి కిర్లంపూడికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వైసీపీలోకి ముద్రగడను ఆహ్వానించనున్నారు. అంతేకాదు, ఎన్నికల కోడ్ రాకముందే ముద్రగడకు నామినేటెట్ పదవిపై సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ముద్రగడకు మిథున్ రెడ్డి స్వయంగా వివరించనున్నారు.
ఎన్నికలు ముగిసిన వెంటనే ముద్రగడకు కీలక పదవిని ఇస్తారని తెలుస్తోంది. ఈ నెల 12న వైసీపీలో ముద్రగడ చేరుతారని ఆయన అనుచరులు చెపుతున్నారు. మరోవైపు, కిర్లంపూడికి వెళ్లి ముద్రగడను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలుస్తారని గతంలో ప్రచారం జరిగింది. అయితే, ముద్రగడ విషయంలో పవన్ ఏమాత్రం స్పందించలేదు. ఈ క్రమంలో ముద్రగడకు వైసీపీ టచ్ లోకి వెళ్లింది.