Delhi High Court: కుటుంబం నుంచి వేరుపడాలని భర్తను కోరడం క్రూరత్వమే.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
- భార్య ఇంటి పనులు చేయాలని భర్త ఆశించడం క్రూరత్వం కాబోదని వ్యాఖ్య
- హిందూ కుటుంబంలో పెళ్లి తర్వాత కొడుకు విడిపోవడం అవాంఛనీయ సంస్కృతి అని పునరుద్ఘాటన
- కుటుంబానికి దూరమవ్వాలంటూ భార్య కోరుతోందని కోర్టును ఆశ్రయించిన భర్తకు విడాకులు మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు
కుటుంబం నుంచి వేరుపడి జీవించాలని భర్తను భార్య కోరడం క్రూరత్వంతో సమానమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే భార్య తన ఇంటి పనులు చేయాలని భర్త ఆశించడాన్ని క్రూరత్వంగా చెప్పలేదని కోర్ట్ పేర్కొంది. భవిష్యత్ బాధ్యతలను పంచుకోవాలనే ఉద్దేశం వివాహంలో దాగి ఉందని న్యాయస్థానం పేర్కొంది. భర్త ఇంటి పనులు చేయడాన్ని భార్య సహాయంగా భావించకూడదని, కుటుంబం పట్ల ఆమెకున్న ప్రేమ, ఆప్యాయతను ఈ పనులు తెలియజేస్తాయని న్యాయస్థానం అభివర్ణించింది. భార్య క్రూరత్వాన్ని భరించలేకపోతున్నానని, విడాకులు కావాంటూ ఓ వ్యక్తి ఆశ్రయించగా ఫ్యామిలీ కోర్టు తిరస్కరించింది. ఈ తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాలు చేయగా పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
సీఐఎస్ఎఫ్‌లో పనిచేస్తున్న ఓ వ్యక్తి,.. భార్య ఇంటి పనుల్లో ఏమాత్రం సహకరించడం లేదని, తన ఇంటికి దూరంగా బతుకుదామంటూ క్రూరత్వాన్ని ప్రదర్శిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నాడు. తనపైనే తప్పుడు క్రిమినల్ కేసులు పెట్టి చిక్కుల్లోకి నెట్టిందని వాపోయాడు. కుటుంబం నుంచి వేరుగా జీవించాలని ఒత్తిడి చేస్తోందని, ఆమె మాటకు కట్టుబడి వేరు కాపురం పెట్టినా ఇంటికి దూరమవ్వాలని కోరుతోందని, ఈ కారణాన తనను వదిలేసి, తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయిందని బాధితుడు వాపోయాడు. అన్ని విషయాలను పరిశీలించిన ఢిల్లీ హైకోర్ట్ బాధిత భర్తకు విడాకులు మంజూరు చేసింది. ప్రతివాది భార్య చేతిలో పిటిషనర్ (భర్త) క్రూరత్వానికి గురయ్యాడని న్యాయస్థానం తేల్చింది. 2019లో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. హిందూ వివాహ చట్టం-1955లోని సెక్షన్ 13(1) (IA) ప్రకారం విడాకులు మంజూరు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది.
వృద్ధాప్యంలో ఎటువంటి ఆదాయ వనరులు లేని, పరిమిత ఆదాయ వనరులు ఉన్న తన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన నైతిక, చట్టపరమైన బాధ్యతలు కొడుకుపై ఉన్నాయని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. హిందూ కుటుంబాల్లో వివాహం తర్వాత కుటుంబం నుంచి కొడుకు విడిపోవడం వాంఛనీయ సంస్కృతి కాదని జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. ‘నరేంద్ర వర్సెస్ కె. మీనా కేసులో’ కొడుకును తన కుటుంబం నుంచి వేరుపడాలని కోరడం క్రూరత్వంతో సమానమని సుప్రీంకోర్టు చెప్పిందని ప్రస్తావించింది.