Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసిన ఢిల్లీ కోర్టు
- ఇప్పటికి 8 సార్లు సమన్లు జారీ చేసిన ఈడీ
- విచారణకు హాజరు కాని కేజ్రీవాల్
- రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన ఈడీ
లిక్కర్ పాలసీ విచారణ వ్యవహారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు, ఈడీకి మధ్య డ్రామా కొసాగుతోంది. విచారణకు హాజరు కావాలంటూ కేజ్రీవాల్ కు ఈడీ ఇప్పటికే 8 సార్లు సమన్లు జారీ చేసింది. అయితే, పలు కారణాలను చూపుతూ విచారణకు కేజ్రీవాల్ వెళ్లడం లేదు. దీంతో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఈడీ అధికారులు మరోసారి ఆశ్రయించారు. తాము ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కావడం లేదని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న జరిగే కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు తనకు జారీ చేస్తున్న సమన్లకు సంబంధించి ఈడీకి ఇటీవల కేజ్రీవాల్ లేఖ రాశారు. అసెంబ్లీలో బలపరీక్ష ఉన్నందున విచారణకు హాజరుకాలేనని తెలిపారు. మార్చి 12 తర్వాత ఎప్పుడైనా విచారణకు సిద్ధమేనని చెప్పారు. విచారణకు ప్రత్యక్షంగా కాకుండా, వర్చువల్ గా హాజరవుతానని తెలిపారు. అయితే, కేజ్రీవాల్ ప్రతిపాదనను ఈడీ అధికారులు తిరస్కరించారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ విచారణకు సహరించడం లేదని కోర్టులో మరోసారి పిటిషన్ వేశారు.