Chandrababu: హైదరాబాద్ నుంచి ఢిల్లీ పయనమైన చంద్రబాబు
- ఏపీలో ఆసక్తికర రాజకీయాలు
- ఇప్పటికే టీడీపీ-జనసేన మధ్య పొత్తు
- కూటమికి దగ్గరవుతున్న బీజేపీ
- ఢిల్లీలో అమిత్ షాను కలవనున్న చంద్రబాబు, పవన్
- ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న పురందేశ్వరి
- ఈ రాత్రికి ఢిల్లీ వెళుతున్న పవన్
ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టీడీపీ మళ్లీ బీజేపీకి, ఎన్డీయేకి దగ్గరవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీలో టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉండగా, ఈ కూటమితో బీజేపీకి కూడా చేయి కలిపే అవకాశముంది.
కొన్నిరోజుల కిందటే ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు... నేడు మరోసారి ఢిల్లీ పయనమయ్యారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో హస్తినకు బయల్దేరారు. జనసేనాని పవన్ కల్యాణ్ ఈ రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఢిల్లీలోనే ఉన్నారు.
ఇక, చంద్రబాబు, పవన్... అమిత్ షాను కలవనున్నారు. ఈ భేటీ అనంతరం ఏపీలో పొత్తుపై స్పష్టత రానుంది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అయితే, పొత్తులో భాగంగా టీడీపీ ఇప్పటికే 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, జనసేన ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలతో పాటు 3 ఎంపీ స్థానాలు కూడా కేటాయించారు.
ఇంకా 57 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాల సర్దుబాటుపై ప్రకటన చేయాల్సి ఉంది. బీజేపీతో పొత్తు కుదిరితే ఈ మిగిలిన స్థానాలతో రెండో జాబితా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో... చంద్రబాబు, పవన్ ల ఢిల్లీ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.