Harish Rao: రేవంత్ రెడ్డి తిట్టాలనుకుంటే చంద్రబాబును తిట్టాలి: హరీశ్ రావు

Harish Rao blames congress and chandrababu for palamuro backward

  • పాలమూరు వెనుకబాటుతనానికి చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీనే కారణమన్న హరీశ్ రావు
  • పాలమూరును చంద్రబాబు దత్తత తీసుకొని చేసిందేమీ లేదని విమర్శ
  • రేవంత్ రెడ్డి పాలనలో పౌరుషాన్ని చూపించాలి తప్ప తిట్టడంలో కాదని చురక

మహబూబ్‌నగర్ వెనుకబాటుతనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరినైనా తిట్టాలనుకుంటే తన గురువుగారైన చంద్రబాబును తిట్టాలి... నిందించాల్సి వస్తే పాలమూరుకు కాంగ్రెస్ చేసిన మోసాన్ని నిందించాలని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డిలో పార్టీ నాయకులతో కలిసి హరీశ్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పాలమూరు వెనుకబాటుతనానికి నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలనే కారణమని ఆరోపించారు. చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ లోపాలు పాలమూరు పాలిట శాపాలుగా మారాయన్నారు. మహబూబ్‌నగర్ వేదికగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను ఖండిస్తున్నట్లు చెప్పారు.

పాలమూరు వలసలకు కారణం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే అన్నారు. గత పార్టీలు ప్రాజెక్టుల పేర్లు మార్చారు తప్ప పనులు పూర్తి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో పాలమూరు ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజ్టెలుగా మార్చారన్నారు. ఆ పెండింగ్‌ ప్రాజెక్టులను బీఆర్ఎస్ హయాంలో రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామన్నారు. పాలమూరు పచ్చబడేలా చేసింది కేసీఆరేనని తెలిపారు. బీఆర్ఎస్ కారణంగా పాలమూరుకు మళ్లీ వలసలు తిరిగి వచ్చాయన్నారు. 2014కు ముందు పాలమూరు ఎలా ఉండేది.. ఇప్పుడెలా ఉందో చూడాలన్నారు. పాలమూరును ఆనాడు చంద్రబాబు దత్తత తీసుకున్నారని, పదేళ్లు అధికారంలో ఉన్నా ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. కరవుతో కాంగ్రెస్‌, టీడీపీలు నాడు రాజకీయాలు చేశాయని మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టుకు తాము అనుమతులు తెచ్చామని, కాంగ్రెస్ కాల్వలు తవ్వాలని సూచించారు. నాడు పోతిరెడ్డిపాడు నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి నీళ్లు తీసుకెళుతుంటే రేవంత్ రెడ్డి మాట్లాడలేదన్నారు.

30 ఏళ్లలో కల్వకుర్తి ఆయకట్టు కింద 13 వేల ఎకరాలకు నీళ్లిచ్చారని, బీఆర్‌ఎస్ హయాంలో అదే కల్వకుర్తి కింది 3 లక్షల 7 వేల ఎకరాలకు సాగునీరు అందించామని పేర్కొన్నారు. నెట్టంపాడు కింద ఆనాడు 2700 ఎకరాలకు నీరు ఇవ్వగా... మహబూబ్‌‌నగర్‌ జిల్లాలో తారు 6 లక్షల 50 వేల ఎకరాలకు నీళ్లిచ్చామన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఒక్క మెడికల్, నర్సింగ్ కాలేజీ ఇవ్వలేదని, కానీ తాము పాలమూరు జిల్లాలో 5 మెడికల్‌ కాలేజీలు, టీచింగ్‌ ఆసుపత్రులు ఇచ్చామన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పౌరుషాన్ని పాలనలో చూపించాలి కానీ ప్రతిపక్షాన్ని ఇష్టం వచ్చినట్లు తిట్టడంలో కాదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. కేసీఆర్ కిట్లు తీసుకు వస్తే... రేవంత్ రెడ్డి తిట్లు తిట్టడంలో పోటీ పడుతున్నారని విమర్శించారు. తన ఎత్తు గురించి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. తానూ ఆయన ఎత్తు గురించి మాట్లాడగలనని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News