Ravichandran Ashwin: జట్టులో లేని ముగ్గురికి థాంక్స్ చెప్పిన అశ్విన్
- మరో ఘనత అందుకున్న రవిచంద్రన్ అశ్విన్
- కెరీర్ లో 100వ టెస్టు ఆడుతున్న వైనం
- కోహ్లీ, రహానే, పుజారాలకు కృతజ్ఞతలు తెలిపిన దిగ్గజ ఆఫ్ స్పిన్నర్
టీమిండియా ఆఫ్ స్పిన్ దిగ్గజ రవిచంద్రన్ అశ్విన్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. నేడు టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ధర్మశాలలో ప్రారంభమైన మ్యాచ్ అశ్విన్ కు 100వ టెస్టు. 100 టెస్టులు ఆడిన భారత క్రికెటర్ల జాబితాలో అశ్విన్ 14వ వాడిగా రికార్డు పుటల్లోకెక్కాడు.
ఇప్పటికే టెస్టుల్లో 500 వికెట్ల మార్కు అందుకున్న అశ్విన్ ఇప్పుడు మరో మైలురాయిని అందుకున్నాడు. 100వ టెస్టు ఆడుతున్న నేపథ్యంలో టీమిండియా మేనేజ్ మెంట్ అశ్విన్ కు ప్రత్యేకమైన టోపీని బహూకరించింది.
ఈ సందర్భంగా అశ్విన్ స్పందిస్తూ... జట్టులో లేని ముగ్గురు దిగ్గజ క్రికెటర్లకు కృతజ్ఞతలు తెలిపాడు. వారు విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, ఛటేశ్వర్ పుజారా. పుజారా, రహానే టీమిండియా సెలెక్షన్ పరిధిలో లేరు. ఇక కోహ్లీ వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్ తో సిరీస్ కు దూరమయ్యాడు.
ఈ నేపథ్యంలో అశ్విన్ మాట్లాడుతూ, ఇన్నాళ్ల తన టెస్టు కెరీర్ లో కుటుంబం తర్వాత ఎవరి గురించైనా చెప్పుకోవాల్సి వస్తే అది ఈ ముగ్గురేనని అన్నాడు.
తాను బౌలింగ్ చేస్తున్నప్పుడు షార్ట్ మిడ్ వికెట్ లో కోహ్లీ, లెగ్ స్లిప్ లో పుజారా, స్లిప్స్ లో రహానే ఫీల్డింగ్ చేసేవారని... తన బౌలింగ్ లో వాళ్లు ఎన్నో క్యాచ్ లు పట్టుకుని తన టెస్టు కెరీర్ ను చిరస్మరణీయం చేశారని అశ్విన్ వివరించాడు. తన 500 వికెట్ల ఘనతలో వారికి కూడా భాగం ఉందని వినమ్రంగా తెలిపాడు. అందుకే వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించాడు.