Mallu Bhatti Vikramarka: మా డిమాండ్లకు కేంద్రమంత్రులు సానుకూలంగా స్పందించారు: మల్లు భట్టి విక్రమార్క
- సింగరేణి సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లామన్న ఉపముఖ్యమంత్రి
- కేసీఆర్, కేటీఆర్‌లు ఇంజనీర్లేమీ కాదని... కానీ వారే ఎక్కువ ఊహించుకుంటున్నారని ఎద్దేవా
- కాళేశ్వరం ప్రాజెక్టును వాళ్లు డిజైన్ చేయడం వల్లే డ్యామేజ్ అయిందని ఆరోపణ
తెలంగాణ కోసం తాము పెట్టిన పలు డిమాండ్లకు కేంద్రమంత్రులు సానుకూలంగా స్పందించారని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి సమస్యలను తాము కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లామని తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్, కేటీఆర్‌లు ఇంజనీర్లేమీ కాదని... కానీ వారే ఎక్కువ ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును వాళ్లు డిజైన్ చేయడం వల్లే డ్యామేజ్ అయిందని ఆరోపించారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చే వరకు అడ్డగోలుగా మాట్లాడవద్దని సూచించారు.
సౌర విద్యుత్ ఉత్పత్తిని గ్రామీణ ప్రాంతంలో కూడా తాము ప్రోత్సహిస్తామన్నారు. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ను సరఫరా చేస్తామన్నారు. సౌర విద్యుత్‌తో పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ నేతలు అధికారంతో పాటు ఆలోచనా జ్ఞానాన్ని కూడా కోల్పోయారని విమర్శించారు. వేసవిలో నీటి ఎద్దడి సమస్య రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అధికారులను కూడా అప్రమత్తం చేసినట్లు చెప్పారు. తాము సరైన సమయంలో లోక్ సభ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.