Road Accident: మీ దుస్తులు కూడా ఒక్కోసారి ప్రమాదాల బారినపడేస్తాయి.. కావాలంటే ఈ వీడియో చూడండి!
- రాత్రివేళ రోడ్డు ప్రమాదాలకు నలుపు రంగు దుస్తులు కూడా కారణమవుతాయంటున్న ట్రాఫిక్ పోలీసులు
- బైకర్లు, పాదచారులు రాత్రివేళ లేతరంగు దుస్తులు ధరించాలని సూచన
- వీలైతే రిఫ్లెక్టివ్ దుస్తులు ధరించాలన్న పోలీసులు
రోడ్డు ప్రమాదాలకు నిర్లక్ష్యం, అతివేగం, నిద్రమత్తు వంటివి కారణమవుతాయన్నది అందరికీ తెలిసిన విషయం. మరి రోడ్డు ప్రమాదం బారినపడడానికి కారణాలేంటి? దీనికి కూడా పైమూడే కారణమన్నది మీ సమాధానం అయితే కావొచ్చు గాక, కానీ మనం ధరించే దుస్తులు కూడా ఒక్కోసారి మనల్ని ప్రమాదాల బారినపడేస్తాయన్న విషయం మీకు తెలుసా? ఈ విషయంలో మీకు పూర్తిగా స్పష్టత రావాలంటే ఈ కింది ఉన్న వీడియో చూడాల్సిందే. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎక్స్‌లో ఈ వీడియోను పంచుకున్నారు.
అందులో ఓ వ్యక్తి నలుపురంగు చొక్కా ధరించి రోడ్డు దాటుతున్నాడు. అతడు ధరించిన చొక్కా రంగు కారణంగా ఎదురుగా వస్తున్న వాహన డ్రైవర్‌కు దగ్గరకు వచ్చే వరకు కనిపించలేదు. క్షణకాలంలో అతడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. రాత్రివేళ రోడ్డు ప్రమాదాలకు దుస్తులు కూడా ఒక కారణమని, కాబట్టి బైక్‌పై వెళ్లేవారు, పాదచారులు రాత్రివేళ నలుపు రంగు దుస్తులు ధరించవద్దని పోలీసులు కోరారు. రాత్రివేళ ప్రయాణంలో ఎప్పుడూ లేతరంగు దుస్తులు అంటే పసుపు, తెలుపు, చిలకాకుపచ్చ రంగు దుస్తులు ధరించాలని, లేదంటే రిఫ్లెక్టివ్ దుస్తులు ధరించాలని, సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.