Sudha Murthy: రాజ్య సభకు సుధామూర్తిని నామినేట్ చేసిన రాష్ట్రపతి.. మోదీ స్పందన!
- సుధామూర్తిని నామినేట్ చేసిన విషయాన్ని ప్రకటించిన మోదీ
- విద్య, సామాజిక సేవలో ఆమె కృషి వెలకట్టలేనిదని ప్రశంస
- రాజ్యసభకు నామినేట్ కావడం నారీ శక్తికి నిదర్శనమని వ్యాఖ్య
ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య సుధామూర్తిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.
ఎక్స్ వేదికగా ప్రధాని స్పందిస్తూ భారత రాష్ట్రపతి సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేశారనే విషయాన్ని తెలిపేందుకు సంతోషిస్తున్నానని చెప్పారు. విద్య, సామాజిక సేవ, దాతృత్వం ఇలా ఎన్నో రంగాల్లో ఆమె చేసిన కృషి వెలకట్టలేనిదని, స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆమె రాజ్యసభకు నామినేట్ అవడం నారీశక్తికి, దేశ నిర్మాణంలో మన మహిళల శక్తి సామర్థ్యాలను చాటి చెప్పడానికి చక్కటి ఉదాహరణ అని చెప్పారు. సుధామూర్తి పార్లమెంటరీ పదవీకాలం ఫలప్రదం కావాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడటం గమనార్హం
సుధామూర్తి చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆమెను 2006లో పద్మశీ, 2023లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. 73 ఏళ్ల సుధామూర్తి ప్రస్తుతం 'మూర్తి ట్రస్ట్'కు ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. సుధామూర్తి తన కెరీర్ ను టెల్కో (ప్రస్తుతం టాటా మోటార్స్) సంస్థలో ఇంజినీర్ గా ప్రారంభించారు.