Posani Krishna Murali: తనను నమ్మిన కాపులను పవన్ కల్యాణ్ నట్టేట ముంచాడు: పోసాని తీవ్ర వ్యాఖ్యలు
- వంగవీటి రంగాను చంద్రబాబు రోడ్డుపై నరికి నరికి చంపించాడన్న పోసాని
- పవన్ ను సీఎం చేసేందుకు కాపులు సిద్ధపడ్డారని వెల్లడి
- కానీ చంద్రబాబును సీఎం చేయాలని పవన్ చెబుతున్నాడని వ్యాఖ్యలు
- కాపుల మనోభావాలు ఎలా ఉంటాయో ఊహించుకోండన్న పోసాని
తనను నమ్మిన కాపులను పవన్ కల్యాణ్ నట్టేట ముంచాడని ఏపీఎఫ్ డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి ఘాటుగా విమర్శించారు. ఒకనాడు చంద్రబాబును తిట్టిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆయననే దేవుడు అంటున్నాడని మండిపడ్డారు. కమ్మ నాయకుడైన చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని కాపులకు చెబుతున్నాడని అన్నారు. పవన్ కల్యాణ్ ను మరో రంగా అనుకున్నారు కానీ, ఇలా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రయత్నిస్తుండడాన్ని కాపులు భరించలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.
"వీడు బతికుంటే మనకు రాజకీయ భవిష్యత్తు లేదు అని భావించి వంగవీటి రంగాను చంద్రబాబు రోడ్డుపై నరికి నరికి చంపించాడు. ఆ ఘటనతో కాపుల్లో కంటతడి పెట్టనివాళ్లంటూ లేరు. ప్రజల్లో ఏ ఒక్కరు కూడా అన్నం ముట్టినవాళ్లు లేరు. అప్పట్లో రంగా గారిని అంతగా ప్రేమించేవాళ్లు. అల్లూరి సీతారామరాజును ఎలా పిరికిపందల్లా చంపారో, రంగా గారిని కూడా అలా చంపారు. ఇదంతా 1987-88 నాటి సంగతి.
ఇప్పుడు మా రంగన్న ఉంటే నూటికి నూరు శాతం ముఖ్యమంత్రి అయ్యేవాడు అని నేడు కాపులు అనుకుంటున్న తరుణంలో పవన్ కల్యాణ్ తెరపైకి వచ్చాడు. కాపు సోదరుల వద్దకు వెళ్లి నేనున్నాను అన్నాడు... నేను పార్టీ పెట్టాను అన్నాడు... మీ అందరూ నాకు అండగా ఉంటే నేను ముఖ్యమంత్రిని అవుతాను అన్నాడు. ఆ మాట చెప్పి చంద్రబాబును, బాలకృష్ణను, నారా లోకేశ్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు.
చంద్రబాబును పచ్చి బూతులు తిట్టాడు. నారా లోకేశ్ ను అయితే చెప్పనక్కర్లేదు. బాలకృష్ణను అయితే చెప్పనక్కర్లేదు... ఘోరంగా తిట్టాడు. కాపు సోదరులు నమ్మారు... చప్పట్లు కొట్టారు. మీరంతా ఐక్యంగా ఉండండి... నేను ముఖ్యమంత్రిని అవుతాను అన్నాడు... అందరూ ఈలలు వేశారు. ఎంతో సంతోషపడ్డారు... రంగా గారు పోయారు, రంగా అంత కాకపోయినా మనందరికీ అండగా ఉంటాడని ఆశపడ్డారు.
మళ్లీ వారాహితో వచ్చి మీరందరూ ఐక్యంగా ఉండండి అన్నాడు... ఉంటాం సార్ మీకోసమే అని కాపులు అన్నారు. నాకోసం కాదు... చంద్రబాబు కోసం అని అన్నాడు. నాకు ముఖ్యమంత్రి అయ్యేంత సీన్ లేదు... కమ్మ నాయకుడు చంద్రబాబునే మనం ముఖ్యమంత్రిని చేయాలని వారితో చెప్పాడు. పవన్ కల్యాణ్ చెప్పిన ఈ మాటతో కాపుల మనోభావాలు ఎలా ఉంటాయో ఒకసారి ఊహించండి.
నేనెందుకు ఈ మాట అంటున్నానంటే... నేనేదో జగన్ గారికి సపోర్ట్ చేస్తున్నానని కాదు. నేను ఓటర్ ని. సమాజంలో ఒకడ్ని. నేను బీజేపీ వాడ్ని కాదు... కానీ మోదీని ఎందుకు ఇష్టపడతానంటే ఆయన నిజాయతీపరుడు కాబట్టి. కేసీఆర్ ను ఎందుకు ఇష్టపడతానంటే ఆయన తెలంగాణ తెచ్చాడు కాబట్టి. మీకందరికీ తెలుసో, లేదో... ఈ రోజుకి కూడా నేను ఏ పార్టీలో సభ్యుడ్ని కాను. 13 ఏళ్లుగా జగన్ ను చూస్తున్నాను. ఉన్నవాళ్లలో జగన్ బెస్ట్ కాబట్టే ఆయనకు మద్దతు ఇస్తున్నాను" అని పోసాని పేర్కొన్నారు.