DK Aruna: రేవంత్ రెడ్డి అభద్రతాభావంలో ఉన్నారు... వారు లోలోన ఒకరి గోతులు మరొకరు తీసుకుంటున్నారు: డీకే అరుణ
- పాలనలో రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ను అనుసరిస్తున్నారని ఆరోపణ
- రేవంత్ రెడ్డి సీఎంలా కాకుండా ప్రతిపక్ష నేతలా మాట్లాడుతున్నారని విమర్శ
- లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మోదీకి ఓటేస్తారని ధీమా
- బీజేపీ రెండో జాబితాలో తన పేరు ఉంటుందని ఆశాభావం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు అభద్రతా భావంలో ఉన్నట్లుగా కనిపిస్తోందని... కాంగ్రెస్ వాళ్లంతా కలిసిఉన్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ... లోలోన ఒకరి గోతులు మరొకరు తీసుకుంటున్నారని బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. శుక్రవారం ఆమె టీవీ 9 ఛానల్‌తో ముఖాముఖిగా మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో కేసీఆర్‌ను అనుసరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిలా కాకుండా ప్రతిపక్ష నేతలా మాట్లాడుతున్నారని విమర్శించారు.
దేశంలో కాంగ్రెస్ లేదు... రాష్ట్రంలో బీఆర్ఎస్ లేదు... లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని... అప్పుడే పాలనపై వ్యతిరేకత బయటకు వస్తోందన్నారు. అందుకే ఇప్పుడు మోదీకి ఓటేస్తామని ప్రజలు చెబుతున్నారన్నారు.
కాంగ్రెస్ నేతలకు వారిపై వారికే నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. అందరూ అభద్రతాభావంలో ఉన్నారన్నారు. మేడిపండు చూడు మేలిమై ఉండును.. పొట్టవిప్పి చూడు పురుగులుండు అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ పైకి మెరుస్తున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ... ఒకరికొకరు మెచ్చుకున్నట్లుగా కనిపించినా... అంతర్గతంగా ఎవరి గోతులు ఎవరు తవ్వుకుంటున్నారో అర్థం కాదని ఎద్దేవా చేశారు.
లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ రెండో జాబితాలో తన పేరు ఉంటుందని డీకే అరుణ ఆశాభావం వ్యక్తం చేశారు. తనతో పాటు జితేందర్ రెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారని... అందుకే మొదటి జాబితాలో పేరు రాలేదన్నారు. ఆయనకు నచ్చచెప్పి తన పేరును ప్రకటిస్తారన్నారు.