Chandrababu: చంద్రబాబు ఆనాడే లక్ష కోట్ల కుంభకోణానికి స్కెచ్ వేశారు: సజ్జల
- ఐఎంజీ భూముల వ్యవహారాన్ని తిరగదోడిన సజ్జల
- వైఎస్ ఔదార్యంతో చంద్రబాబు బతికిపోయారని వ్యాఖ్యలు
- వైఎస్ తలుచుకుని ఉంటే చంద్రబాబు ఊచలు లెక్కబెట్టేవారని వెల్లడి
- అమరావతిలోనూ అలాంటి కుంభకోణానికే తెరలేపారని ఆరోపణ
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అప్పట్లోనే రూ.లక్ష కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని, అది స్కాంలలోకెల్లా అతిపెద్దదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఐఎంజీ భారత్ సంస్థ పేరిట చంద్రబాబు భారీ స్కెచ్ వేశాడని, కానీ వైఎస్ మంచితనం వల్ల చంద్రబాబు జైలు పాలవకుండా బయటపడ్డారని వెల్లడించారు. చంద్రబాబు ఒక ఇంటర్నేషనల్ స్కామర్ అని, ఐఎంజీ తరహాలోనే అమరావతిలోనూ చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారని సజ్జల వివరించారు.
"నారా చంద్రబాబునాయుడు అనే వ్యక్తి దేనికైనా సమర్థుడు. గుడిని, గుడిలోని లింగాన్ని స్వాహా చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు. ఐఎంజీ స్కామ్ ఆ రోజుల్లో అతి పెద్ద కుంభకోణం అని వార్తలు వచ్చాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చర్యలు తీసుకుని ఆ స్కాంకు అడ్డుకట్ట వేశారు. అత్యాశాపరుడైన చంద్రబాబు వంటి ముఖ్యమైన వ్యక్తి స్కాంకు పాల్పడితే ఎలా ఉంటుందో ఐఎంజీ స్కాం చెబుతుంది. అమెరికాలో ఐఎంజీ అనే స్పోర్ట్స్ అకాడమీ ఉంది. దానికి అనుబంధ సంస్థ పేరిట ఐఎంజీ భారత్ అనే సంస్థను 2003 ఆగస్టు 5న ఏర్పాటు చేశారు. ఆగస్టు 9న ఆ సంస్థతో నాటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
పరిశీలించి చూస్తే అసలైన ఐఎంజీ కంపెనీతో ఐఎంజీ భారత్ సంస్థకు ఏమాత్రం సంబంధం లేదు. ఈ వ్యవహారంలోని సంగతులు చూసి, 20 ఏళ్ల తర్వాత తీర్పు వెలువరించిన హైకోర్టు కూడా దిగ్భ్రాంతి చెందింది.
ఐఎంజీ భారత్ అనే బోగస్ కంపెనీకి 850 ఎకరాల భూమి, ప్రాజెక్టు పూర్తయ్యేవరకు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియం, ఇతర స్టేడియాలపై ఆ కంపెనీకి హక్కులు, నిర్వహణ ఖర్చుల కోసం సంవత్సరానికి కనీసం రూ.2.50 కోట్లు, మూడేళ్ల పాటు విద్యుత్, నీటి వినియోగం, ఇతర అవసరాలకు 100 శాతం రీయింబర్స్ మెంట్, స్టేడియంలో అవసరమైనవి తీసుకునే హక్కు, కార్యాలయం కోసం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ వెళ్లేదారిలో 5 వేల గజాల స్థలం... ఇదీ నాడు చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంవోయూలోని అంశాలు.
2003 నవంబరులో చంద్రబాబు ప్రభుత్వం రద్దయింది. అలిపిరి ఘటనతో సానుభూతి పొందేందుకు ఆయన సిఫారసు మేరకు ప్రభుత్వం రద్దయింది. 2004 ఫిబ్రవరిలో గచ్చిబౌలిలో 400 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి సేల్ డీడ్ ఇచ్చారు. అప్పటికే అక్కడ ఖరీదైన వెంచర్లు పడ్డాయి. ఎకరం రూ.2 కోట్లు పలికేది. అలాంటి భూమిని ఎకరం రూ.50 వేల చొప్పున 400 ఎకరాలను రూ.2 కోట్లకు ఇచ్చేశారు.
అప్పుడు చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఎంవోయూ ప్రతిపాదన కేబినెట్ కు వెళ్లిందా అంటే అదీ లేదు. ఆ తర్వాత మామిడిపల్లి వద్ద మరో 450 ఎకరాలు అగ్రిమెంట్ చేశారు. అయితే అదృష్టవశాత్తు ఈ భూమి సేల్ డీడ్ కాలేదు. చంద్రబాబు నాయకత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం మొత్తమ్మీద 850 ఎకరాలు ఐఎంజీ భారత్ కు కట్టబెట్టింది.
ఈ భూములు ఉన్న చోట ఇప్పుడు ఎకరం రూ.100 కోట్లు పలుకుతోంది. ఆ లెక్కన రూ.80 వేల కోట్ల నుంచి, రూ.1 లక్ష కోట్లకు 20 ఏళ్ల క్రితం స్కెచ్ వేసిన ఘనాపాఠీ, గజదొంగ చంద్రబాబునాయుడు. అసలు ఈ వర్ణనలు కూడా చంద్రబాబుకు సరిపోవేమో. మామూలు వ్యక్తులెవరూ ఇంత స్కెచ్ వేయలేరు.
అసలు ఉనికిలో లేని కంపెనీ, ఏ అంతర్జాతీయ సంస్థతో సంబంధం లేని కంపెనీని తీసుకువచ్చి ఒప్పందంతో పాటు అనేక తాయిలాలు కూడా ఇచ్చారు. అదృష్టవశాత్తు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. దాంతో ఆ కుంభకోణం నిలిచిపోయింది. ఆయన మంచితనం వల్ల ఆ కుంభకోణంలో లోతులకు వెళ్లలేదు.
ఎలాగూ స్కాంను సరిదిద్దాం కదా, ఆస్తులు తిరిగొచ్చేశాయి కదా... ఇంకా చర్యలు ఎందుకని ఆయన ఔదార్యం ప్రదర్శించారు. ఆయన చర్యలు తీసుకోనందుకు కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఇంత జరిగితే ప్రభుత్వం నుంచి చర్యలు ఏవని అడిగింది. వైఎస్ ఆనాడు అనుకుని ఉంటే చంద్రబాబు అప్పుడే ఊచలు లెక్కబెట్టేవాడు. వైఎస్ మంచితనం వల్ల బతికిపోయాడు.
ఆ తర్వాత మళ్లీ చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చాడు. అప్పటికీ ఇప్పటికీ చంద్రబాబు ఏమీ మారలేదు. పూర్వం కొన్ని దొంగతనాలు జరిగితే అది ఏ ముఠా చేసిందో చెప్పేసేవారట. ఇప్పుడు జరుగుతున్న స్కాంలు చూస్తే చంద్రబాబు మార్కు కనిపిస్తోంది.
2014-19 మధ్యలో కూడా జరిగింది అదే. అమరావతిలో స్టార్టప్ ఏరియా, కోర్ ఏరియా పేరిట ఊరూపేరూ లేని సంస్థను పట్టుకొచ్చి 1700 ఎకరాలు అప్పనంగా కట్టబెట్టారు. ఆ సంస్థకు పలు ప్రోత్సాహకాలు కూడా ప్రకటించారు.
ఈ 1700 ఎకరాల పక్కనే అడ్మినిస్ట్రేటివ్ ఏరియా రావాలి... అందులో ముఖ్యమంత్రి నివాసం, గవర్నర్ నివాసం, అసెంబ్లీ, సచివాలయం... అన్నీ ఈ స్టార్టప్ ఏరియా పక్కన రావాలి... ఇది డెవలప్ అయిన తర్వాత మిగిలివన్నీ రావాలి... అందుకు అవసరమైన మౌలిక వసతులను కూడా రూ.5,500 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వమే రెండేళ్లలో నిర్మించి ఇవ్వాలి... ఆ సంస్థ తన కార్యకలాపాలు పూర్తి చేసుకునేందుకు ఐదేళ్ల చొప్పున మూడు విడతల్లో 15 ఏళ్ల సమయం కేటాయింపు... నాడు ఐఎంజీ స్కాం ఎలా చేశారో, ఇక్కడ రాజధాని పేరుతో రైతుల ఉసురు కొట్టుకుంటూ తన బినామీలనో, తనతో చీకటి ఒప్పందాలు చేసుకున్న సంస్థలకో భూములు అప్పగించి స్కాం చేశారు.
మాజీ మంత్రి నారాయణ 58 ఎకరాలు కొన్నది కూడా ఇక్కడే. ప్రస్తుతం ఆ కేసు నడుస్తోంది. మొదట 3 వేల ఎకరాలు అనుకున్నారు కానీ, ఎందుకో 1700 ఎకరాలకు దిగారు. ఐఎంజీ భూముల విషయంలో ఎలా చేశారో ఇక్కడా సేమ్... ఇక్కడ రూ.40 వేల కోట్లో, రూ.50 వేల కోట్లో మింగేయొచ్చనేది వాళ్ల ఆలోచన. ఎక్కడా లేని రాయితీలు ఇచ్చారు. ఎక్కడైనా భూములు డెవలప్ మెంట్ కు ఇస్తే మౌలిక సదుపాయాలు వాళ్లే ఏర్పాటు చేసుకుంటారు... ప్రభుత్వానికే సొమ్ము ఎదురు చెల్లిస్తారు. కానీ ఇక్కడ అంతా ఉల్టా జరిగింది. ఇటీవల చంద్రబాబు అరెస్ట్ అయిన స్కిల్ స్కాం కూడా ఇలాంటిదే" అని సజ్జల వివరించారు.