Asaduddin Owaisi: రేవంత్ రెడ్డి అయిదేళ్లు ప్రశాంతంగా పని చేసుకుంటూ వెళ్లవచ్చు... మేం అండగా ఉంటాం: అసదుద్దీన్ ఒవైసీ
- రేవంత్ రెడ్డి పట్టుదల కలిగిన నేత... అందుకే ఈ స్థాయికి వచ్చారని కితాబు
- అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని వెల్లడి
- పాతబస్తీ అభివృద్ధికి రూ.120 కోట్లు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపిన అసదుద్దీన్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిదేళ్లు ప్రశాంతంగా పని చేసుకుంటూ వెళ్లవచ్చునని... తాము అండగా ఉంటామని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముఖ్యమంత్రిపై అసదుద్దీన్ ప్రశంసలు కూడా కురిపించారు. రేవంత్ రెడ్డి చాలా పట్టుదల కలిగిన నేత అని... అందుకే ఈ స్థాయికి వచ్చారని పేర్కొన్నారు. పాత బస్తీ మెట్రో రైలు మార్గానికి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అసదుద్దీన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును తాము శిరసావహిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రేవంత్ రెడ్డికి తాము అండగా ఉంటామన్నారు.
తెలంగాణ ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారని, కానీ కొన్ని శక్తులు విధ్వంసానికి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. అలాంటి శక్తులను అడ్డుకోవాల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రిని కలవగానే పాతబస్తీ అభివృద్ధికి రూ.120 కోట్లు విడుదల చేశారని చెబుతూ... ఈ నిధులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవంతిని నిర్మించాలని కోరారు. కాంగ్రెస్ చేపట్టిన మూసీ అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. చంచల్ గూడ జైలును హైదరాబాద్ వెలుపలకు తరలించి... ఆ స్థానంలో కేజీ టు పీజీ క్యాంపస్ నిర్మించాలని సూచించారు.