James Anderson: 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చ‌రిత్రలో ఒకే ఒక్క‌డు!

James Anderson becomes first pacer to take 700 wickets in Test cricket

  • 187 టెస్టుల్లో 700 వికెట్లు తీసిన జేమ్స్ అండ‌ర్స‌న్‌
  • టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఈ ఫీట్ సాధించిన తొలి పేస్ బౌల‌ర్‌
  • అత్య‌ధిక వికెట్ల‌లో ముర‌ళీ ధ‌ర‌న్, షేన్ వార్న్ త‌ర్వాత మూడో బౌల‌ర్‌

ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రుగుతున్న చివ‌రి టెస్టులో ఇంగ్లండ్ సీనియ‌ర్ పేస‌ర్ జేమ్స్ అండ‌ర్స‌న్ చ‌రిత్ర సృష్టించారు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చ‌రిత్రలో 700 వికెట్లు ప‌డ‌గొట్టిన తొలి పేస్ బౌల‌ర్‌గా నిలిచాడు. 187 టెస్టుల్లో అండ‌ర్స‌న్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. కుల్దీప్ యాద‌వ్ వికెట్ తీయడంతో ఈ రికార్డు న‌మోదైంది. 41 ఏళ్ల అండర్సన్ టెస్ట్ చరిత్రలో అతిపెద్ద‌ వయస్కుడైన ఆటగాడు. 2002లో జింబాబ్వేపై తన టెస్ట్ కెరీర్‌ను ప్రారంభించాడు. త‌న 22 ఏళ్ల సుదీర్ఘ టెస్టు క్రికెట్ కెరీర్ ఇప్పుడు ఇలా 700 వికెట్ల మార్క్‌తో మరే మీడియం పేసర్‌కు ద‌క్కని ఘనతను సాధించాడు. టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల జాబితాలో అండ‌ర్స‌న్ మూడో స్థానంలో ఉన్నాడు. అత‌ని కంటే ముందు శ్రీలంక దిగ్గ‌జ స్పిన్న‌ర్ ముత్త‌య్య ముర‌ళీ ధ‌ర‌న్ (800), షేన్ వార్న్ (708), తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. భార‌త్ నుంచి అనిల్ కుంబ్లే 619 వికెట్ల‌తో నాలుగో స్థానంలో ఉన్నాడు. 

100 నుంచి 700వ వికెట్‌ వ‌ర‌కు అండ‌ర్స‌న్ ఔట్ చేసిన క్రికెట‌ర్లు వీరే..
జాక్వెస్ కలిస్, దక్షిణాఫ్రికా (2008) - 100వ వికెట్
పీటర్ సిడిల్, ఆస్ట్రేలియా (2010) - 200వ వికెట్
పీటర్ ఫుల్టన్, న్యూజిలాండ్ (2013) - 300వ వికెట్
మార్టిన్ గప్టిల్, న్యూజిలాండ్ (2015) - 400వ వికెట్
క్రైగ్ బ్రైత్‌వైట్, వెస్టిండీస్ (2017) - 500వ వికెట్
అజర్ అలీ, పాకిస్థాన్ (2020) - 600వ వికెట్
కుల్దీప్ యాదవ్, భారత్ (2024)- 700వ వికెట్ 

ఇక ధ‌ర్మ‌శాల టెస్టులో భార‌త్ పట్టుబిగించింద‌నే చెప్పాలి. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఏకంగా 259 ప‌రుగుల ఆధిక్యం సాధించింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 218 ప‌రుగులు చేయ‌గా.. టీమిండియా 477 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది. క‌నుక ఏదైనా అద్భుతం జ‌రిగితే త‌ప్ప ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన విజయం లాంఛ‌న‌మే అని చెప్పొచ్చు. ఎందుకంటే పిచ్ స్పిన్న‌ర్ల‌కు బాగా అనుకూలిస్తుంది. ఈ పిచ్‌పై రాబోయే రోజుల్లో బ్యాటింగ్ అంత సులువు కాక‌పోవ‌చ్చు.

  • Loading...

More Telugu News