Aadhaar Updation: త్వరపడండి! మిగిలింది ఆరు రోజులే.. ఆధార్‌ను త్వరగా అప్‌డేట్ చేసుకోండి!
- ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు ఈ నెల 14 వరకు గడువు
- ఆ తర్వాత డబ్బులిచ్చి చేసుకోవాల్సిందే
- యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లడం ద్వారా కావాల్సిన మార్పులు చేసుకొనే వెసులుబాటు
- మార్పులు ధ్రువీకరించే పత్రాల అప్‌లోడ్ తప్పనిసరి
ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు మరో ఆరు రోజుల్లో అంటే ఈ నెల 14తో ముగియనుంది. ఇప్పటీకి తమ ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోనివారు త్వరగా ఆ పనేదో పూర్తిచేయకుంటే తర్వాత డబ్బులు చెల్లించి అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవాలనుకునేవారు సమీపంలోని ఆధార్ సెంటర్‌కు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్స్ ఇచ్చి అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇందుకు వారు రూ. 50 వరకు వసూలు చేసే అవకాశం ఉంది. అదే ఆన్‌లైన్‌లో అయితే ఉచితంగా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ఆధార్ అప్‌డేషన్ కోసం తొలుత ఆధార్ అధికారిక వెబ్‌సైట్ https://myaadhaar.uidai.gov.in/కు వెళ్లాలి. మన ఆధార్ నంబర్, క్యాప్చా నమోదు చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మన ఫోన్ నంబరుకు వచ్చిన ఓటీపీని నమోదు చేస్తే అప్ డేషన్‌కు సైట్ సిద్ధమవుతుంది. అప్‌డేట్ డొమోగ్రాఫిక్స్ డేటా ఎంచుకుని మనం ఏమేం అప్‌డేట్ చేయాలనుకుంటున్నామో ఆ వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత ప్రొసీడ్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అయితే, మనం అప్‌డేట్ చేసే సమాచారాన్ని ధ్రువీకరించే పత్రాలను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
నమోదు చేసిన వివరాలు సరిగ్గా ఉన్నాయో, లేదో మరోసారి చెక్ చేసుకుని ఆ తర్వాత చేంజ్ రిక్వెస్ట్‌పై క్లిక్ చేస్తే సరి. ఫామ్ సబ్మిట్ అయిపోతుంది. మార్పులు ఎంతవరకు వచ్చాయో తెలుసుకునేందుకు అప్‌డేట్ చేసినప్పుడు వచ్చిన అప్‌డేట్ అభ్యర్థన సంఖ్య (యూఆర్ఎన్)ను ఎంటర్ చేయడం ద్వారా మన అప్లికేషన్ ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు.