Andhra Pradesh: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరింది... ఢిల్లీ నుంచి అధికారిక ప్రకటన చేసిన కనకమేడల

Kanakamedala announces alliance between three parties confirmed

  • ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం
  • బీజేపీ అగ్రనాయకత్వంతో చంద్రబాబు, పవన్ చర్చలు సఫలం
  • 2024 ఎన్నికలకు కలిసి వెళ్లాలని నిర్ణయం

ఏపీ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న పరిణామం నేడు వాస్తవరూపం దాల్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. గత మూడ్రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొత్తుకు బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఒప్పించారు. 

దీనిపై నేడు టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్రకుమార్ అధికారికంగా వెల్లడించారు. ఏపీలో మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరిందని తెలిపారు.. పొత్తు ప్రకారం మూడు పార్టీలు ఓ కూటమిగా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాయని వివరించారు. ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేస్తాయని కనకమేడల చెప్పారు. పొత్తుకు మూడు పార్టీల నేతలు అంగీకరించారని, సీట్ల సర్దుబాటుపై అవగాహనకు వచ్చారని తెలిపారు. 

టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్లడంపై ఎలాంటి గందరగోళం లేదని, అన్ని అంశాలపై అవగాహన కుదిరిందని అన్నారు. ఇవాళ్టి వరకు జరిపిన చర్చల అనంతరం... ఎన్డీయేలో  చేరడం, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఖరారైందని, సీట్ల పంపకంపై తుది నిర్ణయానికి వస్తున్నారని కనకమేడల వివరించారు. 

రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయని, ఈ క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్నామని వెల్లడించారు. ఆయా ఇబ్బందులపై చంద్రబాబు నిన్న పలువురు నేతలతో మాట్లాడారని, పరిస్థితులను వారికి వివరించి ఒప్పిస్తున్నారని తెలిపారు. 

చంద్రబాబు నేతలతో మాట్లాడకముందే... జగన్ పాలనకు చరమగీతం పాడాలంటే పొత్తులు అవసరమని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాల్సిన అవసరం ఉందన్న విషయం ప్రజలు గుర్తించారని కనకమేడల వివరించారు. ప్రజల్లో ఉన్న ఆ భావనకు అనుగుణంగా, పార్టీల ఆలోచనలకు అనుగుణంగా, వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో ఈ మూడు పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయని చెప్పారు. ఈ దిశగా పార్టీ శ్రేణులు పనిచేయాలని చంద్రబాబు చెప్పారని స్పష్టం చేశారు. 

పొత్తు కారణంగా సీట్ల పంపకం వల్ల కొందరిలో అసంతృప్తి ఉండొచ్చని, వారికి పార్టీ నాయకత్వం న్యాయం చేస్తుందని అన్నారు.

  • Loading...

More Telugu News