Ravichandran Ashwin: చరిత్ర సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్.. తొలి భారత బౌలర్‌గా రికార్డ్!
- అత్యధికసార్లు (36) ఐదు వికెట్లు పడగొట్టిన అశ్విన్
- న్యూజిలాండ్ క్రికెటర్ రిచర్డ్ హడ్లీ రికార్డు సమం
- ఇదే మ్యాచ్‌లో డకౌటయిన అశ్విన్ పేరిట మరో చెత్త రికార్డు
ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు 100వ టెస్టు మ్యాచ్ అనే విషయం తెలిసిందే. ఈ ప్రత్యేకమైన మ్యాచ్‌లో అశ్విన్ చరిత్ర సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం ద్వారా అత్యధికసార్లు (36) ఈ ఫీట్ సాధించిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత మరో స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే 5 వికెట్ల మార్క్‌ను 35సార్లు సాధించాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్ 36వ సారి ఐదు వికెట్లు తీసి, అనిల్ కుంబ్లేను దాటేశాడు. అలాగే మొత్తం '5 వికెట్ల' జాబితాలోనూ మూడో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ క్రికెటర్ రిచర్డ్ హడ్లీని సమం చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 9 వికెట్లు పడగొట్టిన అశ్విన్ మరో వికెట్ తీసి ఉంటే.. తన వందో టెస్టు మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన తొలి బౌలర్ మరో అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకునేవాడు.
కాగా, ఇదే మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ మరో చెత్త రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. అదే.. 100వ టెస్టులో డకౌట్ కావడం.. ఇలా మైల్స్టోన్ మ్యాచ్‌లో డకౌట్ అయిన మూడో భారత క్రికెటర్ కూడా అశ్వినే. అతనికి కంటే ముందు దిలీప్ వెంగ్‌సర్కార్, ఛటేశ్వర్ పుజారా ఇలా వందో టెస్టులో పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాటపట్టారు. ఓవరాల్‌గా చూసుకుంటే 100వ టెస్టులో డకౌటైన క్రికెటర్లలో అశ్విన్‌ది 9వ స్థానం. అశ్విన్ కంటే ముందు టెస్టుల్లో ఈ చెత్త రికార్డును మూటగట్టుకున్న ఆటగాళ్లు దిలీప్ వెంగ్‌సర్కార్, ఛటేశ్వర్ పుజారా, అలన్ బోర్డర్, కౌర్ట్నీ వాల్ష్, మార్క్ టేలర్, స్టీఫెన్ ఫ్లెమింగ్, అలిస్టర్ కుక్, బ్రెండన్ మెకల్లమ్ ఉన్నారు.