JP Nadda: ఎన్డీయేలో చేరాలన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం: జేపీ నడ్డా
- ఢిల్లీలో బీజేపీ నాయకత్వంతో చంద్రబాబు, పవన్ చర్చలు
- ఎన్డీయే కూటమిలో టీడీపీ, జనసేన చేరికకు మార్గం సుగమం
- మూడు పార్టీలు కలిసి మోదీ నాయకత్వంలో ముందుకెళతాయన్న నడ్డా
- ఏపీ అభివృద్ధికి బీజేపీ, టీడీపీ, జనసేన కట్టుబడి ఉన్నాయని ప్రకటన
ఈసారి లోక్ సభ ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ... ఒకప్పటి మిత్ర పక్షాలను మళ్లీ ఎన్డీయేలోకి ఆహ్వానిస్తోంది. ఏపీ విపక్ష నేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ లతో ఢిల్లీలో బీజేపీ హైకమాండ్ జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి.
దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ ప్రకటన చేశారు. ఎన్డీయే కుటుంబంలో చేరాలన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు నడ్డా వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత, అద్భుత నాయకత్వంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ముందుకెళతాయని తెలిపారు. మూడు పార్టీలు దేశ ప్రగతికి కట్టుబడి ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, ప్రజల అభివృద్ధికి చిత్తశుద్ధితో పాటు పడతాయని నడ్డా పేర్కొన్నారు.