Revanth Reddy: ఎల్బీ నగర్ వస్తే నా గుండె వేగం పెరుగుతుంది: బైరామల్‌గూడ ఫ్లైఓవర్ ప్రారంభం సందర్భంగా రేవంత్ రెడ్డి
- తన స్నేహితులు, బంధువులు, జిల్లా ప్రజలు ఎక్కువగా ఎల్బీ నగర్ ప్రాంతంలోనే ఉన్నారన్న ముఖ్యమంత్రి
- నగర ప్రజల అవసరాలు తీర్చేలా మెట్రో రైలును కూడా విస్తరిస్తామని హామీ
- శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో సేవలు అందిస్తామన్న రేవంత్ రెడ్డి
ఎల్బీ నగర్‌కు వస్తే తన గుండె వేగం పెరుగుతుందని... తన స్నేహితులు, బంధువులు, జిల్లా ప్రజలు ఎక్కువగా ఈ ప్రాంతంలోనే ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన ఎస్ఆర్డీపీలో భాగంగా సాగర్ రోడ్డు కూడలిలో నిర్మించిన బైరామల్‌గూడ ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2019 ఎంపీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలు తనకు 30వేల మెజార్టీ ఇచ్చారన్నారు. నగర ప్రజల అవసరాలు తీర్చేలా మెట్రో రైలును కూడా విస్తరిస్తామన్నారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో సేవలు అందిస్తామన్నారు.
ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైలును పొడిగిస్తామని తెలిపారు. రాజేంద్రనగర్‌లో హైకోర్టు నిర్మిస్తామని, అక్కడి వరకు మెట్రో రైలు పొడిగింపు ఉంటుందన్నారు. రూ.50వేల కోట్లతో మూసీనదిని ఆధునికీకరిస్తామన్నారు. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు.