BJP: బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ పచౌరి
- కుల, వర్గ భేదాలు లేని సమాజాన్ని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమన్న సురేశ్ పచౌరి
- గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజామోదయోగ్యంగా లేవని విమర్శ
- బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకను తిరస్కరించడం... అందుకు పార్టీ ఉపయోగించిన భాష నిరాశపరిచిందని వ్యాఖ్య
మధ్యప్రదేశ్ ప్రముఖ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ పచౌరి శనివారం బీజేపీలో చేరారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో కాషాయ కండువాను కప్పుకున్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఇది షాకింగ్ అని చెప్పవచ్చు. ఆయనతో పాటు మాజీ ఎంపీ గజేంద్ర సింగ్ కూడా బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా సురేశ్ పచౌరి మాట్లాడుతూ... దేశానికి తనవంతు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని... కుల, వర్గ భేదాలు లేని సమాజాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యమన్నారు. కానీ గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజామోదయోగ్యంగా లేవన్నారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకను తిరస్కరించడం... అందుకు పార్టీ ఉపయోగించిన భాష ఎంతో నిరాశపరిచాయన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానాన్ని తిరస్కరించాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలన్నారు. కాంగ్రెస్ నిర్ణయాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయన్నారు.