Rohit Sharma: తాను ఎప్పుడు రిటైర్ అయ్యేదీ చెప్పిన రోహిత్ శర్మ
- తన ఆట తీరు బాగాలేదనుకున్న రోజున వెంటనే రిటైర్మెంట్ ప్రకటిస్తానన్న రోహిత్
- రెండు మూడేళ్లుగా తన ఆట అత్యుత్తమంగా ఉందని వెల్లడి
- ప్రశాంత మనసుతో ఆడితే పరుగులు అవే వస్తాయని వ్యాఖ్య
- భారీ స్కోర్ల కంటే జట్టు అవసరాలకు తగ్గట్టు ఆడుతున్నానని వెల్లడి
తన రిటైర్మెంట్‌పై రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తుండడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తన ఆట బాగాలేదని అనిపించిన రోజున వెంటనే ఆటకు గుడ్‌బై చెప్పేస్తానని అన్నాడు. తనలో ఆట ఇంకా మిగిలి ఉందని స్పష్టం చేశాడు. జియో సినిమా ప్రీరికార్డెడ్ ఇంటర్వ్యూలో మరో వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్‌తో రోహిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘‘నేను సరిగ్గా ఆడటం లేదని భావించినప్పుడు ఈ విషయాన్ని టీమ్ మేనేజ్‌మెంట్‌కు చెప్పి రిటైర్ అవుతా. కానీ నిజాయతీగా చెప్పాలంటే గత రెండు, మూడు ఏళ్లుగా నా ఆట మరింత మెరుగైంది. అత్యుత్తమ ఆట తీరును కనబరుస్తున్నా. నేను గణాంకాలు, రికార్డుల గురించి పెద్దగా పట్టించుకునే వ్యక్తిని కాదు. భారీ స్కోరులు చేయడం ముఖ్యమేకానీ జట్టు అవసరాలకు తగ్గట్టు ఆడటంపై దృష్టిపెట్టాను. నేను జట్టులో కొంత మార్పు తీసుకురావాలనుకున్నాను. ఆటగాళ్లు చాలా స్వేచ్ఛగా ఆడటం మీరు చూస్తున్నారు. వ్యక్తిగత స్కోర్లు ముఖ్యం కాదు. నిర్భయంగా, మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఆడితే పరుగులు వాటంతట అవే వస్తాయి’’ అని రోహిత్ శర్మ చెప్పాడు.
రోహిత్ శర్మ శకం ముగిసిందని ఇటీవల ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జాఫ్రీ బాయ్‌కాట్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఇంగ్లండ్‌తో టెస్టు సీరిస్‌లో రోహిత్ తన విమర్శకులకు తగిన జవాబు ఇచ్చాడు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి దిగ్గజాలు అందుబాటులో లేకపోయినా టీమిండియాకు 4-1తో అద్భుత విజయం అందించాడు.