Indonesia Flight Detour: మార్గమధ్యంలో కునుకులోకి జారిన పైలట్లు.. దారి తప్పిన విమానం!

Indonesia flight takes detour after pilots fall asleep

  • ఇండోనేషియాలో జనవరి 25న ఘటన
  • సులవేసీ-జకార్తా విమానం మార్గమధ్యంలో ఉండగా కునుకు తీసిన పైలట్లు
  • 28 నిమిషాల పాటు నిద్రలో కూరుకుపోవడంతో దారి తప్పిన విమానం
  • ఎట్టకేలకు ప్రధాన పైలట్‌కు మెలకువ రావడంతో తప్పిన ప్రమాదం
  • ఘటనపై ప్రభుత్వం సీరియస్, పైలట్లపై వేటు, విచారణకు ఆదేశం

ఇండోనేషియాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. విమానం మార్గమధ్యంలో ఉండగా ఇద్దరు పైలెట్లు కునుకులోకి జారుకోవడంతో ఫ్లైట్ దారి తప్పింది. దాదాపు అరగంట తరువాత ప్రధాన పైలట్‌కు మెలకువ రావడంతో పొరపాటు గుర్తించి తప్పును సరిదిద్దారు. అదృష్టం బాగుండబట్టి ప్రయాణికులందరూ ప్రాణాలతో బయటపడ్డారు. 

బాతిక్ ఎయిర్‌ సంస్థకు చెందిన ఓ విమానం నలుగురు క్రూ, 153 మంది ప్రయాణికులతో సౌత్ ఈస్ట్ సులవేసి నుంచి దేశ రాజధాని జకార్తాకు బయలుదేరింది. విమానం బయలుదేరిన కాసేపటికి ప్రధాన పైలట్ తన కోపైలట్ అనుమతి తీసుకుని చిన్న కునుకు తీశారు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన కోపైలట్ కూడా అనూహ్యంగా నిద్రలోకి జారుకున్నారు. ఇద్దరూ దాదాపు 28 నిమిషాలు నిద్రలోనే ఉండటంతో విమానం దారి తప్పింది. విమానం తప్పుడు మార్గంలో వెళుతోందని జకార్తాలోని కంట్రోల్ సెంటర్ గుర్తించి పైలట్లను నిద్రలేపేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. చివరకు పైలట్‌కు మెలకువ రావడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. 

సుమారు 28 నిమిషాల తరువాత నిద్ర లేచిన పైలట్ జరిగిన పొరపాటును గుర్తించి తోటి పైలట్‌నూ నిద్రలేపారు. కంట్రోల్ సెంటర్ కాల్స్‌కు స్పందించి విమానాన్ని సరైనా మార్గంలోకి మళ్లించారు. జనవరి 25 జరిగిన ఈ ఘటనను ఆ దేశ రవాణా శాఖ తీవ్రంగా పరిగణించింది. ఇద్దరు పైలట్లను విధుల నుంచి తప్పించి ఘటనపై విచారణకు ఆదేశించింది.

  • Loading...

More Telugu News