Lord Rama: శ్రీరాముడు కనుక ఇప్పుడు ఉండి ఉంటే బీజేపీ ఆయనపైకి కూడా ఈడీ-సీబీఐని ఉసిగొల్పేది: కేజ్రీవాల్
- రాముడిని తమ పార్టీలో చేరమని బీజేపీ కోరేదన్న కేజ్రీవాల్
- అందుకు ఆయన నిరాకరిస్తే ఈడీ, సీబీఐని పంపేదని ఎద్దేవా
- దేశంలో తానేదో పెద్ద ఉగ్రవాదిని అయినట్టు పదేపదే సమన్లు పంపిస్తున్నారని ఆగ్రహం
- తనను జైలుకు పంపి తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తోందని ఆరోపణ
- కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు
శ్రీరాముడు కనుక ఈ కాలంలో ఉండి ఉంటే బీజేపీ ఆయనను కూడా వదిలేది కాదని, తమ పార్టీలో చేరమని ఒత్తిడి చేసి ఉండేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ఒకవేళ రాముడు కనుక బీజేపీలో చేరేది లేదని చెబితే ఈడీ, సీబీఐలను ఆయనపైకి ఉసిగొల్పి ఉండేదని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం అసెంబ్లీలో ఇటీవల ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్‌పై నిన్న అసెంబ్లీలో మాట్లాడిన కేజ్రీవాల్ కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ప్రభత్వం ‘వికాస్’మోడల్‌ను కొనసాగిస్తుంటే బీజేపీ మాత్రం ‘వినాశ్‘ను ఎంచుకుని ప్రతిపక్ష పార్టీలు ఏలుతున్న ప్రభుత్వాలను పడగొడుతున్నదని ఆరోపించారు. తనకు 8 సమన్లు పంపడంపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. తనను అరెస్ట్ చేసి జైలుకు పంపి తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే తాను అతిపెద్ద ఉగ్రవాదిని అయినట్టు వారు తనకు నోటీసులు పంపారని పేర్కొన్నారు.
కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కేజ్రీవాల్ ప్రతిసారి శ్రీరాముడిని రాజకీయాల్లోకి లాగి కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు ఇవే చివరి ఎన్నికల్లా అనిపిస్తున్నాయని బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా ఎద్దేవా చేశారు. సానుభూతి కోసం ఆప్ నేతలు పదేపదే రాముడిని రాజకీయాల్లోకి లాగడం విచారకరమని అన్నారు.