Gold Treasure: ఆ సమాధి బంగారు కొండ.. 1200 ఏళ్లనాటి సమాధిలో బంగారం నిధిని గుర్తించిన పురావస్తు శాస్త్రవేత్తలు.. వీడియో ఇదిగో!
- మధ్య అమెరికా దేశమైన పనామాలో సమాధి
- తవ్వకాల్లో బయటపడిన బంగారం, దుస్తులు, విలువైన సంపద
- సమాధిలో చనిపోయిన వ్యక్తితోపాటు 32 శవాల అవశేషాల గుర్తింపు
- కోక్లే సంస్కృతికి చెందిన ఉన్నతస్థాయి ప్రభువు సమాధిగా చెబుతున్న శాస్త్రవేత్తలు
1200 ఏళ్లనాటి సమాధి అది. కానీ, దానిని తవ్వి చూస్తే మాత్రం ఏకంగా పెద్ద నిధి బయటపడింది. బంగారంతోపాటు విలువైన వస్తువులు అందులో కనిపించడంతో పురావస్తు శాస్త్రవేత్తలు ఒక్క క్షణం షాకయ్యారు. మధ్య అమెరికా దేశమైన పనామాలో ఈ సమాధిని గుర్తించిన శాస్త్రవేత్తలు తవ్వకాలు జరపగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పనామాకు 100 మైళ్ల దూరంలో ఉన్న ఎల్‌కానో ఆర్కియాలాజికల్ పార్కులో 1200 ఏళ్లనాటి ఈ పురాతన సమాధిని గుర్తించారు.
సమాధిలో ఒకటి కంటే ఎక్కువ శవాల అవశేషాలు బయటపడ్డాయి. వాటితోపాటు పెద్ద ఎత్తున బంగారు నిధి బయటపడింది. అలాగే, బంగారంతో తయారుచేసిన దుస్తులు, బ్రాస్‌లెట్లు, చెవిపోగులు, గంటలు, బెల్టులు, తిమింగలం పన్నుతో అలంకరించిన చెవిపోగులు, నగలు, సిరామిక్ వస్తువులు వంటివి గుట్టలుగా ఉన్నాయి. కోక్లే సంస్కృతికి చెందిన ఉన్నతస్థాయి వర్గానికి చెందిన ప్రభువు సమాధిగా దీనిని గుర్తించారు. చనిపోయిన వ్యక్తితోపాటు ఆయనకు తోడుగా ఉండేందుకు బలిదానం చేసిన 32 శవాల అవశేషాలను కూడా పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు.