Payyavula Keshav: లోకేశ్ సరికొత్త పంథాలో ముందుకెళుతున్నారు: పయ్యావుల కేశవ్
- ఉరవకొండ-లత్తవరం వద్ద శంఖారావం సభ
- ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రసంగం
- కార్యకర్తల మనోభావాలు తెలుసుకునేందుకే శంఖారావం అని వెల్లడి
- టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు రాష్ట్రానికి మేలు కలయిక అని వ్యాఖ్యలు
పార్టీ కార్యకర్తల మనోభావాలను తెలుసుకునేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం చేపట్టారని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. ఉరవకొండ - లత్తవరం శంఖారావం సభలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రసంగించారు.
లోకేశ్ సరికొత్త పంథాలో ముందుకెళుతున్నారని కొనియాడారు. మరో మూడు నాలుగు రోజుల్లో ఎన్నికల షెడ్యూలు విడుదల కాబోతుందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు ఢిల్లీ పెద్దలు తెలుసుకోవడం వల్లే నిన్న పొత్తు ప్రకటన చేశారని పయ్యావుల వివరించారు. ఇది దేశంలోనే కీలక పరిణామంగా మారిందని అన్నారు. టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు రాష్ట్రానికి మేలు కలయిక అని అభివర్ణించారు. ఈ కలయిక దేశానికి శుభశూచకమని ఆర్నబ్ గోస్వామి అనే జర్నలిస్టు వారి చానల్ లో చెప్పారని వెల్లడించారు.
అదే చంద్రబాబు సిద్ధాంతం!
అభివృద్ధితో ఆదాయాన్ని సృష్టించి పేదలకు పంచడం చంద్రబాబునాయుడు సిద్ధాంతం. చేతగాని సీఎం జగన్ అప్పులు తెచ్చి పంచడంతో రాష్ట్రం ఆర్థికంగా కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. పోలీసులకు లీవ్ ఎన్ క్యాష్ మెంట్ కూడా చెల్లించలేని దుస్థితిలో ఈ దివాలాకోరు ప్రభుత్వం ఉంది. చంద్రబాబు హయాంలో అన్ని వర్గాల ఉద్యోగులకు జీత భత్యాలు పెరిగితే, జగన్ వచ్చాక తగ్గించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అరాచక ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
1994 నాటి ఫలితాలు రిపీట్ అవుతాయి
1994 నాటి ఫలితాలు 2024లో పునరావృతం కాబోతున్నాయి, మూడు పార్టీల కూటమి విజయదుందుభి మోగించబోతోంది. గత ప్రభుత్వ హయాంలో 20 వేల మంది పేదలకు ఇళ్లపట్టాలు, చెరువులకు నీరిచ్చాం. జలదీక్ష చేసి మూడు నెలల్లో నీరిస్తామన్న జగన్... అయిదేళ్లయినా 3 ఎకరాలకు కూడా నీరివ్వలేదు, 3 తట్టల మట్టి తీయలేదు. అధికారంలోకి వచ్చాక జలదీక్ష మాని ధన దీక్షలో పడిపోయారు, దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. 60రూపాయల క్వార్టర్ 180 రూపాయలు అయింది, 120 రూపాయలు నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్తోంది.
జగన్ ను ఓడించడానికి అందరూ సిద్ధం
రాష్ట్రంలో జగన్ ను ఓడించేందుకు ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, నిరుద్యోగులు, చేనేతలు సిద్ధంగా ఉన్నారు. జగన్ పాలనలో దగాపడ్డ దళితులు, బీసీలు ఆయనను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన్ ను ఓడించడానికి తల్లీ చెల్లితోపాటు 5 కోట్ల ప్రజలు రెడీగా ఉన్నారు.
గెలిచినా, ఓడినా నేను ఉరవకొండతోనే...!
గెలిచినా, ఓడినా 20 ఏళ్లుగా ఉరవకొండ ప్రజలతో నా అనుబంధం కొనసాగుతూనే ఉంది. గెలుపు పిలుపు వినబడుతోంది, అలసత్యాన్ని వీడి కార్యకర్తలంతా పనిచేయాల్సిన తరుణం ఆసన్నమైంది. ఏ సర్వే చూసినా ఉరవకొండ నియోజకవర్గంలో స్పష్టమైన ఆధిక్యత కన్పిస్తోంది. అప్రమత్తంగా ఉండి పార్టీ విజయానికి కృషిచేయాలి. మనది వసుదైక కుటుంబం... చిన్న చిన్న విభేదాలు పక్కనబెట్టి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.