Jagan: చంద్రబాబు దత్తపుత్రుడ్ని ఎందుకు తెచ్చుకున్నాడంటే...!: సీఎం జగన్

CM Jagan slams  Chandrababu and Pawan Kalyan in Medarametla Siddham meeting

  • మేదరమెట్ల వద్ద సిద్ధం సభ
  • హాజరైన సీఎం జగన్
  • ఇప్పుడు దక్షిణ కోస్తా కూడా యుద్ధానికి సిద్ధం అయిందని వ్యాఖ్యలు
  • ప్రజలే శ్రీకృష్ణుడు అయితే నేను అర్జునుడ్ని అంటూ వెల్లడి 

బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద వైసీపీ సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగించారు. మరో ఐదేళ్లు నన్ను ఆశీర్వదించేందుకు వచ్చిన ఈ ప్రజా సైన్యానికి సెల్యూట్ చేస్తున్నా అంటూ ప్రసంగం ప్రారంభించారు. సిద్ధం అంటే ప్రజలు చేసే యుద్ధం అని, సిద్ధం అంటే ప్రజా సముద్రం అని పేర్కొన్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా, రాయలసీమ సిద్ధం అయ్యాయని, ఇప్పుడు  దక్షిణ కోస్తా కూడా సిద్ధం అయిందని అన్నారు. ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం వంటివని, ప్రజలే శ్రీకృష్ణుడు అయితే, తాను అర్జునుడ్ని అని సీఎం జగన్ అభివర్ణించారు. 

చంద్రబాబులా నాకు పొలిటికల్ స్టార్ క్యాంపెనర్లు లేరు

చంద్రబాబు మాదిరిగా నాకు నటించే పొలిటికల్ స్టార్ క్యాంపెయినర్లు ఎవరూ లేరు. నాకు చంద్రబాబులా ఈనాడు లేదు, ఆంధ్రజ్యోతి లేదు, టీవీ5 లేదు. అబద్ధాలకు రంగులు వేసే ఎల్లో మీడియా లేదు. మీ బిడ్డకు రకరకాల పొత్తులు లేవు. ఎన్నికలకు మీ బిడ్డ ఒంటరిగానే వెళుతున్నాడు. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో... నాకు అంతమంది పేదింటి స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ నాకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. ఇవాళ నా ఎదుట ఇసుక వేస్తే రాలనంతగా ఉన్న మీరందరూ కూడా నాకు స్టార్ క్యాంపెయినర్లే.

చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి

ఎన్నికలు సమీపిస్తుంటే జగన్ పేరు వింటేనే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మీ బిడ్డ ఇంటింటికీ చేసిన అభివృద్ధిని చూసి చంద్రబాబు భయపడుతున్నాడు. మనను నేరుగా ఎదుర్కొనలేక ఢిల్లీ వెళ్లి పొత్తులు పెట్టుకున్నారు. మన ఎమ్మెల్యేలు గడపగడపకు తిరుగుతుంటే, చంద్రబాబు మాత్రం ఢిల్లీలో ఇతర పార్టీల గడపలకు తిరుగుతున్నారు. 

మన ఫ్యానుకు అక్కడ్నించి కరెంటు వస్తుంది

మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ కాదు. వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం పూర్తి చేశామన్న నిజాయతీ నుంచి మన ఫ్యానుకు కరెంటు వస్తుంది. మేనిఫెస్టో నాకు ఒక పవిత్ర గ్రంథం. మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్, ఒక భగవద్గీత, ఒక బైబిల్ తో సమానం. అన్ని హామీలు నెరవేర్చి ప్రజల్లో విశ్వసనీయత సంపాదించుకున్నాం. 

మన ఫ్యాన్ కు కరెంటు ప్రజల్లోంచి వస్తుంది. మన ఫ్యాన్ కు కరెంటు ఇంటింటికీ చేసిన మంచి నుంచి వస్తుంది. మనం అందించిన నవరత్నాల్లోంచి మన ఫ్యానుకు కరెంటు వస్తుంది. లంచాలు లేని, వివక్ష లేని పాలన నుంచి మన ఫ్యానుకు కరెంటు వస్తుంది. 

చంద్రబాబు సైకిల్ కు చక్రాలు లేవు

చంద్రబాబు పరిస్థితి ఏమిటి అని గమనిస్తే... చంద్రబాబు ఈ ఎన్నికలకు తుప్పు పట్టిన సైకిల్ తో వస్తున్నాడు. చంద్రబాబు సైకిల్ కు ట్యూబులు లేవు, చక్రాలు లేవు. ఆ తుప్పు పట్టిన సైకిల్ ను నెట్టడానికి చంద్రబాబుకు వేరే పార్టీల సాయం కావాల్సి వచ్చింది. ఇదీ చంద్రబాబు నాయుడి గారి జాబ్ రిక్వైర్ మెంట్. 

బాబు పేరు చెబితే ఒక్క మంచి కూడా గుర్తుకు రాదు. అందుకే పొత్తుల్లో భాగంగా ముందు ఒక ప్యాకేజి ఇచ్చి దత్తపుత్రుడ్ని తెచ్చుకున్నాడు. ఎందుకు ఈ ప్యాకేజీ స్టార్ ను తెచ్చుకున్నాడంటే... ఈ దత్తపుత్రుడు సైకిల్ సీటు కావాలని అడగడు, తన వాళ్లకు సీట్లు కావాలని అడగనే అడగడు. నాకు ఎందుకిన్ని తక్కువ సీట్లు ఇస్తున్నావని ప్రశ్నించడు... కావాలంటే తాను తాగుతున్న టీ గ్లాసును కూడా చంద్రబాబుకే ఇచ్చేస్తాడు. 

ఈ దత్తపుత్రుడు చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు... చంద్రబాబు స్టాండ్ అంటే నిలబడతాడు. ఎప్పుడు సైకిల్ దిగమంటే అప్పుడు దిగుతాడు. ఎప్పుడు సైకిల్ ను తోయమంటే అప్పుడు తోస్తాడు. పొత్తుల్లో ఉండమంటే పొత్తుల్లో ఉంటాడు... విభేదించినట్టు  నటించేలా డ్రామా ఆడమంటే రక్తి కట్టించేలా డ్రామా కూడా ఆడతాడు. 

కలకాలం గుర్తుండిపోవాలంటే ఏం చేయాలని వెనకటికి ఎవరో చంద్రబాబును అడిగారట. అందుకు ఆ బాబు ఏం చెప్పారంటే... అన్నం పెడితే అరిగిపోతుంది, చీర ఇస్తే చిరిగిపోతుంది, ఇల్లు కట్టిస్తే  కూలిపోతుంది... కర్రు కాల్చి వాత పెడితే మాత్రమే కలకాలం గుర్తుండిపోతుంది అని అన్నారట. 14 ఏళ్లు సీఎంగా ఉన్న ఈ చంద్రబాబు కూడా అలాంటివాడే. అదే చేశాడు. ఇలాంటి ఈ చంద్రబాబు ఎంతమందితో పొత్తులు పెట్టుకున్నా కూడా వచ్చేది సున్నా. ఈ సున్నా ఎన్నిపార్టీలతో కలిసినా దాని విలువ బోడి సున్నా.

  • Loading...

More Telugu News