Ram Gopal Varma: మంచివాళ్లుగా నటించడం మానుకుంటే మంచిది: రామ్ గోపాల్ వర్మ
- ఆ మూడూ వదిలేయాలన్న వర్మ
- నటిస్తూ బ్రతకడం మానుకోవాలని వ్యాఖ్య
- ఎవరి గురించి ఎవరూ పట్టించుకోరన్న వర్మ
- గిరి గీసుకోకపోతే సూపర్ ఫ్రీగా ఉండొచ్చని వెల్లడి
రామ్ గోపాల్ వర్మ గురించి .. ఆయన మాటతీరును గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. తాజాగా ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆయన మాదిరిగా సూపర్ ఫ్రీగా ఉండాలంటే ఏం చేయాలనే ఒక ప్రశ్న ఆయనకి ఎదురైంది. అందుకు వర్మ తనదైన స్టైల్లో స్పందించారు.
" దేవుడిని .. ఫ్యామిలీని .. వదిలేయాలి. సమాజం గురించి పట్టించుకోకూడదు. ఈ మూడు విషయాలే మనల్ని బంధించి ఉంచుతూ ఉంటాయి. ఇలా చేయకు అలా చేయి అని దేవుడు చెప్పాడో లేదుగానీ, ఆయన చెప్పాడని కొంతమంది అంటారు. ఇక భార్య .. పిల్లలు .. తల్లిదండ్రులు వీళ్లంతా ఫ్యామిలీ క్రిందికి వస్తారు. చాలామంది వాళ్ల దగ్గర మంచివాళ్ల మాదిరిగా నటిస్తూ ఉంటారు" అని అన్నారు.
"ఇక పక్కింటి వాళ్లు .. ఆఫీసులో మనతో కలిసి పనిచేసేవాళ్లు .. వీళ్లంతా సొసైటీ క్రిందికి వస్తారు. వాళ్ల దగ్గర కూడా మంచి వాళ్ల మాదిరిగా నటించడం చేస్తుంటారు. ఎవరి దగ్గరో మంచివాళ్లమని అనిపించుకోవడం కోసం బ్రతికేస్తూ ఉంటారు. అలా నటించడం మానేస్తే ఎవరైనా సరే సూపర్ ఫ్రీగా ఉండొచ్చు. ఎవరో ఏదో అనుకుంటూ ఉంటారని ప్రతివాళ్లు గిరిగీసుకుని బ్రతికేస్తూ ఉంటారు. నిజానికి ఇక్కడ ఎవరి గురించి ఎవరూ పట్టించుకోరు" అని చెప్పారు.