Roja: నగరిలో తన వ్యతిరేక వర్గీయులపై నిప్పుల చెరిగిన రోజా
- తిరుపతిలో ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారన్న రోజా
- పార్టీ క్యాడర్ ను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారని మండిపాటు
- అందరికీ బుద్ధి చెప్పే సమయం ఆసన్నమయిందని వ్యాఖ్య
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో నగరి వైసీపీలో వర్గ విభేదాలు ఎక్కువవుతున్నాయి. రోజా వ్యతిరేక వర్గీయులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆమెను విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన వ్యతిరేక వర్గ నేతలపై రోజా నిప్పులు చెరిగారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ప్రతిరోజు రూ. 500 కట్టి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారు వైసీపీలో ఉండటం వల్ల నగరిలో 500 మెజార్టీ వస్తుందని.... వీళ్లు బయటకు వెళ్తే తాను 30 వేల నుంచి 40 వేల వరకు మెజార్టీ సాధిస్తానని చెప్పారు. మీరు మాట్లాడినట్టు తన వాళ్లు కూడా మాట్లాడితే మీరు తట్టుకోగలరా? అని ప్రశ్నించారు.
నగరిలో మాట్లాడే ధైర్యం లేక తిరుపతిలో కూర్చొని మాట్లాడుతూ నగరి పరువు తీస్తున్నారని అన్నారు. పార్టీ క్యాడర్ ను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారని విమర్శించారు. వీళ్లందరికీ బుద్ధి చెప్పే సమయం ఆసన్నమయిందని అన్నారు. ప్రతిపక్షాలతో పోరాడుతూ జగనన్న ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తున్నారని... అదే విధంగా నగరిలో తాను కూడా వెన్నుపోటు దారులతో పోరాటం చేస్తూనే ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధిని అందిస్తున్నానని చెప్పారు.