Hyderabad Air port: హైదరాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
- ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఉత్తమ విమానాశ్రయంగా ఎంపిక
- అవార్డు కోసం ప్రపంచంలోని 400 విమానాశ్రయాల పోటీ
- 30కి పైగా పనితీరు సూచికల ఆధారంగా అంతిమ విజేత ఎంపిక
- అవార్డు దక్కడంపై జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈఓ ప్రదీప్ పణికర్ హర్షం
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం లభించింది. ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు గాను ఈ పురస్కారం లభించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) వార్షిక అవార్డుల్లో భాగంగా ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ఏఎస్‌క్యూ) విభాగంలో 2023 ఏడాదికి గాను ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో హైదరాబాద్ ఉత్తమ విమానాశ్రయంగా నిలిచిందని జీఎంఆర్ సంస్థ తెలిపింది.
ఏడాదికి 1.5 నుంచి 2.5 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తూ, ప్రపంచంలోని 400 విమానాశ్రయాలు ఈ అవార్డు కోసం పోటీ పడ్డాయి. 30కి పైగా పనితీరు సూచికల ఆధారంగా అంతిమ విజేతను నిర్ణయించారు. ఇక ఈ అవార్డు లభించడం పట్ల జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈఓ ప్రదీప్ పణికర్ హర్షం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్ నిర్వహణలో భాగమైన అందరికీ ఈ పురస్కారాన్ని అంకితం చేశారు. అలాగే ఎయిర్పోర్ట్ విస్తరణ ప్రణాళికలో భాగంగా టెర్మినల్, ఎయిర్‌సైడ్ ప్రాంతాల్లో కొత్త సౌకర్యాలు, మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.