NIA: నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ ముమ్మర తనిఖీలు
- పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్లో ఎన్ఐఏ సోదాలు
- ఖలిస్తానీ ఉగ్రవాదులతో లోకల్ గ్యాంగ్స్టర్లకు సంబంధాల కేసు నేపథ్యంలో తనిఖీలు
- లోకల్ మాఫియా, ఖలిస్తానీ ఉగ్రవాదుల మధ్య నెట్వర్క్ ఛేదనకై సోదాలన్న ఎన్ఐఏ వర్గాలు
పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్లోని 30 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఏక కాలంలో తనిఖీలు నిర్వహిస్తోంది. ఖలిస్తానీ ఉగ్రవాదులతో లోకల్ గ్యాంగ్స్టర్లకు సంబంధాల కేసులో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. దీనిలో భాగంగా పంజాబ్ రాష్ట్రం మోగా జిల్లాలోని బిలాస్పూర్ గ్రామ పరిధిలోని ఫర్దికోట్లో ఓ వ్యాపార వేత్త ఇంట్లోనూ ఎన్ఐఏ సోదాలు చేసింది.
ఖలిస్తానీ ఉగ్రవాదులు, లోకల్ మాఫియా మధ్య అంతకంతకు బలపడుతున్న నెట్వర్క్లను ఛేదించేందుకు ముమ్మర తనిఖీలు చేస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. ఈ తనిఖీల ద్వారా ఉగ్రవాదులకు సంబంధించిన నగదు సీజ్ చేయడం, వారి ఆస్తుల ధ్రువపత్రాలను స్వాధీనం చేసుకుని వాటిని అటాచ్ చేయడం సాధ్యమవుతుందని ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.