ML Khattar: ఆసక్తికరంగా హర్యానా పాలిటిక్స్... సీఎం పదవికి రాజీనామా చేసిన ఖత్తర్
- హర్యానాలో బీజేపీ-జేజేపీ పొత్తుకు బీటలు
- హర్యానా అసెంబ్లీలో బీజేపీ బలం... 41
- బీజేపీకి మద్దతు ఇవ్వనున్న ఐదుగురు జేజేపీ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఇండిపెండెంట్లు
ఇటీవల బీహార్ లో పొత్తు విచ్ఛిన్నమై సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్, బీజేపీతో జట్టు కట్టి మళ్లీ సీఎం పీఠం అధిష్ఠించడం తెలిసిందే. ఇప్పుడలాంటి రాజకీయాలే హర్యానాలోనూ నెలకొన్నాయి. ఇక్కడ కూడా పొత్తుకు బీటలు వారింది.
బీజేపీ-జననాయక్ జనతా పార్టీ కూటమిలో చీలికలు రావడంతో సీఎం పదవికి మనోహర్ లాల్ ఖత్తర్ రాజీనామా చేశారు. ఖత్తర్ బాటలోనే ఆయన క్యాబినెట్ మంత్రులు కూడా రాజీనామా చేశారు. ఈ సాయంత్రానికి హర్యానా రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి.
హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 సీట్లు ఉండగా, బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, జననాయక్ జనతా పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు ఖత్తర్ వర్గానికి మద్దతు ఇవ్వనున్నారు. అంతేకాదు, నూతనంగా ఏర్పడే ప్రభుత్వానికి మరో ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా లభించనుంది.