Yashasvi Jaiswal: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా యశస్వి జైస్వాల్
- ఫిబ్రవరి నెలలో కేన్ విలియమ్సన్, పాతుమ్ నిస్సాంక, యశస్వి అవార్డు కోసం పోటీ
- గత నెలలో అద్భుత ప్రదర్శన కారణంగా విజేతగా జైస్వాల్
- మొట్టమొదటిసారి యంగ్ ప్లేయర్ ఖాతాలో 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు
ఫిబ్రవరి నెలలో 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డును భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ గెలుచుకున్నాడు. ఈ మేరకు ఐసీసీ వెల్లడించింది. భారత యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాత్తో పాటు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, శ్రీలంకకు చెందిన పాతుమ్ నిస్సాంక ఈ నెల 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు కోసం పోటీ పడ్డారు. చివరికి ఈ అవార్డు యశస్విని వరించింది. కాగా, ఈ ముగ్గురు బ్యాట్స్మెన్లు గత నెలలో చాలా పరుగులు చేసి తమ తమ జట్ల విజయంలో కీలక పాత్ర పోషించారు.
యశస్వి జైస్వాల్ గత నెలలో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడగా, వాటిలో రెండింట్లో వరుసగా డబుల్ సెంచరీలు బాదాడు. దీంతో వరుసగా టెస్టు మ్యాచుల్లో డబుల్ సెంచరీలు సాధించిన మూడో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ గత నెలలో 3మ్యాచ్‌ల్లో 112 సగటుతో మొత్తం 560 పరుగులు చేశాడు. ఇలా తన అద్భుతమైన ప్రదర్శన కారణంగానే యశస్వి జైస్వాల్ మొట్టమొదటిసారి 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐ యశస్వికి శుభాకాంక్షలు తెలియజేసింది.