Vidadala Rajini: మంత్రి రజనిపై తీవ్ర ఆరోపణలు చేసిన చిలకలూరిపేట వైసీపీ ఇన్చార్జి రాజేశ్
- చిలకలూరిపేట వైసీపీలో సంక్షోభం
- అధిష్ఠానంపై తిరగబడిన వైసీపీ ఇన్చార్జి
- మంత్రి రజని తన నుంచి రూ.6.5 కోట్లు తీసుకుందని ఆరోపణ
- సజ్జలకు చెబితే రూ.3 కోట్లు వెనక్కి ఇప్పించారని వెల్లడి
- మిగతా డబ్బు ఇవ్వకుండా మంత్రి రజని మోసం చేసిందన్న రాజేశ్
- సజ్జల "వదిలేయండయ్యా" అన్నారని ఆవేదన
అధికార వైసీపీకి టికెట్ల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. చిలకలూరిపేట వైసీపీ ఇన్చార్జి మల్లెల రాజేశ్ నాయుడిని తప్పించి, మరొకరికి టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజేశ్ నాయుడు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి విడదల రజనిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
మంత్రి రజని తన నుంచి రూ.6.5 కోట్లు తీసుకున్నారని రాజేశ్ వెల్లడించారు. ఈ విషయం సజ్జలకు చెబితే కేవలం రూ.3 కోట్లు వెనక్కి ఇప్పించారని, మిగతా డబ్బులు అడిగితే, "వదిలేయండయ్యా" అని సజ్జల చెప్పారని వివరించారు. మిగతా డబ్బులు ఇవ్వకుండా మంత్రి రజని మోసం చేశారని రాజేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రజనికి సత్తా ఉంటే చిలకలూరిపేటలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్ కు టికెట్ ఇస్తే రూ.20 కోట్లు ఖర్చు పెట్టుకుంటానని, బయటి వారికి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని రాజేశ్ అధిష్ఠానానికి హెచ్చరికలు చేశారు.