BJP: అదే జరిగితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాను: అసోం సీఎం హిమంత బిశ్వశర్మ
- ఎన్నార్సీకి దరఖాస్తు చేయకుండా ఒక్కరికైనా కొత్తగా పౌరసత్వం లభిస్తే మొదట తానే వ్యతిరేకిస్తానన్న సీఎం
- సీఏఏ చట్టాన్ని వ్యతిరేకించేవారు చెప్పే మాటలు నిజమా... కాదా? అనే విషయం పోర్టల్‌లో ఉన్న డేటానే చెబుతుందని వెల్లడి
- అయినా సీఏఏ చట్టం కొత్తదేమీ కాదన్న హిమంత బిశ్వశర్మ
ఎన్నార్సీకి దరఖాస్తు చేయకుండా ఒక్కరికైనా కొత్తగా వచ్చిన సీఏఏ చట్టం కింద పౌరసత్వం లభిస్తే మొదట వ్యతిరేకించే వ్యక్తిని తానేనని... అలా జరిగితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. సీఏఏ చట్టంతో లక్షల మంది అసోంలోకి ప్రవేశిస్తారనే భయాలు ఆ రాష్ట్ర ప్రజల్లో నెలకొన్నాయి. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ, అదే జరిగితే అవసరమైతే తాను రాజీనామా చేసేందుకు కూడా వెనుకాడేది లేదన్నారు.
ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... సీఏఏ చట్టాన్ని వ్యతిరేకించేవారు చెప్పే మాటలు నిజమా... కాదా? అనే విషయం పోర్టల్‌లో ఉన్న డేటానే చెబుతుందన్నారు. అయినా సీఏఏ చట్టం కొత్తదేమీ కాదని తెలిపారు. గతంలోనే రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందని వెల్లడించారు. అవసరమైన వారు నిర్దేశిత పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు.