Musheer Khan: రంజీ ట్రోఫీ ఫైనల్లో సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన కుర్రాడు ముషీర్ ఖాన్
- రంజీ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ బాదిన అతిపిన్న వయస్కుడిగా నిలిచిన యువ క్రికెటర్
- విదర్భపై ఫైనల్ మ్యాచ్‌లో రాణించిన ముంబై ఆటగాడు
- జట్టు త్వరత్వరగా వికెట్లు కోల్పోయిన స్థితిలో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ముషీర్ ఖాన్
ముంబై, విదర్భ మధ్య ముంబై వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ముషీర్ ఖాన్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 136 పరుగుల భారీ సెంచరీ బాదిన ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీ ఫైనల్లో అతిపిన్న వయస్కుడిగా అవతరించాడు. 19 ఏళ్ల 41 రోజుల వయసులో ముషీర్ ఖాన్ శతకాన్ని నమోదు చేశాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్ 1994/95 సీజన్ ఫైనల్లో పంజాబ్‌పై రెండు సెంచరీలు బాదాడు. అయితే సచిన్ కంటే తక్కువ వయసులోనే ముషీర్ ఖాన్ సెంచరీ బాదడం రికార్డుగా నిలిచింది.
కాగా విదర్భపై ఫైనల్ మ్యాచ్‌లో ముంబై రెండో ఇన్నింగ్స్‌లో వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో కెప్టెన్ అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్‌లతో కలిసి ముషీర్ ఖాన్ కీలకమైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు. కాగా ముషీర్ ఆల్‌రౌండ్ ప్లేయర్. బౌలింగ్ కూడా అద్భుతంగా చేయగలడు. కాగా మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 528 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 224, రెండో ఇన్నింగ్స్‌లో 418 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇక విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 105 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో ప్రస్తుతం 10/0గా ఉంది.