CPI Narayana: విపక్షాలు అంటే లెక్కలేనితనం వల్లే ఇందిరాగాంధీ, కేసీఆర్ ఓడిపోయారు: సీపీఐ నారాయణ
- బీజేపీ వ్యతిరేక పార్టీలను మోదీ దెబ్బతీస్తున్నారన్న నారాయణ
- ప్రభుత్వమే కసాయిగా మారితే ఎవరికి చెప్పుకోవాలంటూ ఆగ్రహం
- ఇంకా లొంగకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీని వేధిస్తున్నారని విమర్శలు
ఇటీవల కాలంలో విపక్ష నేతలపై ఈడీ, సీబీఐ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ బీజేపీ అధినాయకత్వంపై మండిపడ్డారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను మోదీ దెబ్బతీస్తున్నారని, ఈడీ దాడులతో వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వమే కసాయిగా మారితే ఎవరికి చెప్పుకోవాలి? గొర్రెకు చెప్పుకోవాలా? అని నారాయణ ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిన వారు అడ్రస్ లేకుండా పోయారని, ప్రతిపక్షాలు అంటే లెక్కలేనితనం వల్లే ఇందిరాగాంధీ, కేసీఆర్ ఓడిపోయారని వ్యాఖ్యానించారు. ఇంకా లొంగలేదు కనుకనే ఆమ్ ఆద్మీ పార్టీకి వేధింపులు ఎదురవుతున్నాయని అన్నారు. ఎలక్టోరల్ బాండ్లను అధికార పక్షం దుర్వినియోగం చేస్తోందని, ఆ డబ్బు 92 శాతం బీజేపీకే పోయిందని నారాయణ ఆరోపించారు.