CAA: భారత ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: కేంద్ర హోంశాఖ
- భారత పౌరులను ఎవరినీ తమ పౌరసత్వం నిరూపించుకోవడం కోసం పత్రాలు అడగరని స్పష్టీకరణ
- సీఏఏ భారత ముస్లింల పౌరసత్వంపై ఎలాంటి ప్రభావం చూపదని వెల్లడి
- హిందువులతో పాటు 18 కోట్ల భారత ముస్లింలు సమాన హక్కులు కలిగి ఉంటారని వెల్లడి
పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర హోంశాఖ మంగళవారం స్పష్టం చేసింది. భారత పౌరులను ఎవరినీ తమ పౌరసత్వం నిరూపించుకోవడం కోసం ఎలాంటి పత్రాలు ఎవరూ అడగరని తెలిపింది. సీఏఏ గురించి భారత ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చింది. భారత ముస్లింల పౌరసత్వంపై సీఏఏ ఎలాంటి ప్రభావం చూపించదని పేర్కొంది. హిందువులు, ఇతర మతాలతో పాటు 18 కోట్ల భారత ముస్లింలకు కూడా సమాన హక్కులు ఉంటాయని తేల్చి చెప్పింది. సీఏఏ నిన్నటి నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురి ఆందోళనపై కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది.