Jeevan Reddy: రేవంత్ రెడ్డి మూడు నెలల్లోనే చేసి చూపించారు: జీవన్ రెడ్డి ప్రశంస
- కేసీఆర్ సభకు రాకుండా... టీవీ ముందుకు వస్తా అంటున్నారు... ఆయనను ఎవరు ఆపుతున్నారు? అని చురక
- ఖరీఫ్‌కు సాగు నీరు అందకపోవడానికి... తద్వారా కరవుకూ కేసీఆరే కారణమని ఆరోపణ
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ కూడా కనుమరుగవుతుందని వ్యాఖ్య
బీఆర్ఎస్ పదేళ్లలో చెయ్యలేనివి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు నెలల్లో చేసి చూపించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా మీడియా ముందుకు వస్తానని చెబుతున్నాడని... టీవీ ముందుకు వస్తా అంటే ఎవరు ఆపుతారు? అని ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియాలన్నారు. ఖరీఫ్‌కు సాగు నీరు అందకపోవడానికి... తద్వారా కరవుకూ కేసీఆరే కారణమని ఆరోపించారు. మిషన్ భగీరథ ఫెయిల్యూర్ ప్రాజెక్టు అని దుయ్యబట్టారు. కమిషన్ల కక్కుర్తితో మిషన్ భగీరథ ప్రాజెక్టు తీసుకువచ్చారన్నారు. ఆ సలహా ఇచ్చిన అధికారిని ఉరి తీయాలని తాను సభలోనే చెప్పానన్నారు.
కాళేశ్వరం, యాదాద్రి పవర్ ప్రాజెక్టు అక్రమాలపై న్యాయ విచారణ వేయడంతో కేసీఆర్ పరేషాన్లో పడ్డారన్నారు. మూడు పిల్లర్లు దెబ్బతింటే అయిపోయిందా? అని కేసీఆర్ నిన్న సభలో అంటున్నారని... గుండె పోయాక మనిషి బతుకుతాడా? అన్నది చెప్పాలన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ ప్రభుత్వమైనా ఏర్పడిన 100 రోజుల్లో హామీలను అమలు చేసిన సందర్భం లేదని... బీఆర్ఎస్ తమ పూర్తి కాలంలో చేయలేనివి తమ ప్రభుత్వం మూడు నెలల్లోనే చేసిందన్నారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ కూడా కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి భాష గురించి కేసీఆర్ నిన్నటి సభలో విమర్శించడంపై జీవన్ రెడ్డి చురక అంటించారు. భాష గురించి కేసీఆరే మాట్లాడాలి... బీఆర్ఎస్ నేతలకు ఇన్ని రోజులు కేసీఆర్ మాట్లాడితే వినసొంపుగా ఉంది... ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడితే సీసం పోసినట్లు ఉందా? అని ఎద్దేవా చేశారు. తమ పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఢిల్లీలో ఉందని... సమావేశాలకు వెళ్లాల్సిన అవసరం తమకు ఉంటుందన్నారు. మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ ఎందుకు వస్తున్నారు? అని ప్రశ్నించారు.