Volunteers: ఎన్నికలకు వాలంటీర్లను వినియోగించడంపై హైకోర్టులో వాదనలు
- పిటిషన్ వేసిన సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ
- సీఈసీ ఆదేశాలను ప్రభుత్వం పాటించడం లేదని పిటిషన్
- సీఈసీ ఆదేశాలను ఎందుకు పాటించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో వాలంటీర్ల పైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. తాజాగా ఎన్నికలకు వాలంటీర్లను వినియోగిస్తున్నారంటూ ఏపీ హైకోర్టులో సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ పిటిషన్ వేసింది. వాలంటీర్లను ఎన్నికల విధులకు ఉపయోగించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చినప్పటికీ... ఆ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని పిటిషన్ లో పేర్కొంది. ఈ పిటిషన్ ఈరోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది.
విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ... కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయడం లేదని చెప్పారు. ఎన్నికల్లో వైసీపీని గెలిపించే బాధ్యత వాలంటీర్లదేనని సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్, ఇతర మంత్రులు చెపుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో... కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను ఎందుకు పాటించడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. వెంటనే తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఆదేశాలు జారీ చేసింది.