Marri Janardhan Reddy: కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.. మల్కాజిగిరి టికెట్ ఆఫర్
- బీజేపీ, కాంగ్రెస్ నుంచి మర్రికి ఆఫర్
- మల్కాజిగిరి, భువనగిరి, వరంగల్, చేవెళ్ల, ఖమ్మం, నాగర్‌కర్నూలు స్థానాలపై కాంగ్రెస్ గురి
- మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ స్థానాలను బీఆర్ఎస్ ఆఫర్ చేసినా పోటీకి విముఖం
- నేడో, రేపో ఆయన పేరును కాంగ్రెస్ ప్రకటించే అవకాశం
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఊపుమీదున్న కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. మరీ ముఖ్యంగా ఖమ్మం, నాగర్‌కర్నూలు, మల్కాజిగిరి, భువనగిరి, వరంగల్, చేవెళ్ల స్థానాల విషయంలో గట్టి అభ్యర్థులను నిలబెట్టాలని భావిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ ఇప్పటికే దాదాపు సగం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు నాలుగు వివాదరహిత స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది.
తాజాగా ఇప్పుడు మల్కాజిగిరి స్థానం తెరపైకి వచ్చింది. నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి త్వరలోనే కాంగ్రెస్‌లో చేరబోతున్నారని, ఆయనకు మల్కాజిగిరి టికెట్ ఆఫర్ చేసినట్టు ప్రచారం ఊపందుకుంది. నాగర్‌కర్నూలు మునిసిపాలిటీలో ఏడుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు నిన్న కాంగ్రెస్‌లో చేరడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.
అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి మర్రి జనార్దన్‌రెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఆయనకు ఆహ్వానాలు అందినా ఆయన ఎటూ నిర్ణయించుకోలేకపోయారు. పార్టీలో చేరితో జహీరాబాద్ టికెట్ ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసినా, కార్యకర్తలతో సంప్రదించకుండా నిర్ణయం తీసుకోలేనని చెప్పేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రచారం ఊపందుకుంది. మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ తరపున ఆయన పోటీ చేయడం లాంఛనమేనని తెలుస్తోంది. అయితే, ఆయన మాత్రం అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతేకాదు, మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ నుంచి ఏదో ఒక స్థానం నుంచి బరిలోకి దిగాలని బీఆర్ఎస్ ఆఫర్ చేసినా ఆయన ఆసక్తి చూపడం లేదని తెలిసింది.