Raghu Rama Krishna Raju: ఆ రూ. 3.5 కోట్లు పెద్దాయన ఖాతాకు చేరి ఉంటాయి: రఘురామకృష్ణరాజు
- టికెట్లు ఇచ్చేందుకు వైసీపీ నాయకత్వం డబ్బులు వసూలు చేసిందన్న రఘురాజు
- సగం డబ్బులైనా రాబట్టుకోవాలంటే రాజేశ్ నాయుడు మాదిరి మీడియా ముందుకు రావాలని సూచన
- నరసాపురం నుంచి తాను పోటీ చేయకుండా అడ్డుకోవాలనే జగన్ ప్రయత్నాలు నెరవేరబోవని వ్యాఖ్య
ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేందుకు ఎంతో మంది నుంచి వైసీపీ నాయకత్వం డబ్బులు వసూలు చేసిందని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. టికెట్ల కోసం డబ్బులిచ్చి మోసపోయిన వైసీపీ నేతలు రాజేశ్ నాయుడిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. రాజేశ్ నాయుడు మాదిరి మీడియా ముందుకొచ్చి వాస్తవాలు చెప్పాలని అన్నారు.
మంత్రి విడదల రజనిని గుంటూరుకు ట్రాన్స్ ఫర్ చేశాక... చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జీగా రాజేశ్ నాయుడుని నియమించారని చెప్పారు. టికెట్ కోసం తన వద్ద నుంచి ఆరున్నర కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు మీడియా ముందు రాజేశ్ వాపోయారని తెలిపారు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద మనసు చేసుకుని రూ. 3 కోట్లు వెనక్కి ఇచ్చేశారట... మిగిలిన మూడున్నర కోట్ల రూపాయలు పెద్దాయన ఖాతాకు చేరి ఉంటాయని అన్నారు. టికెట్ల కోసం డబ్బులిచ్చిన వారు సగం డబ్బులైనా రాబట్టుకోవాలంటే రాజేశ్ నాయుడు తరహాలో మీడియా ముందుకొచ్చి వాస్తవాలను చెప్పాలని సూచించారు. నరసాపురం నుంచి తాను పోటీ చేయకుండా అడ్డుకోవాలనే జగన్ ప్రయత్నాలు నెరవేరబోవని అన్నారు. తాను నరసాపురం నుంచే పోటీ చేస్తానని చెప్పారు.